‘మహిళాశక్తి’కి జై!
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం
- 3 వేల బస్సులకు మహిళలను ఓనర్లను చేస్తాం
- ఆడబిడ్డలను లక్ష్మీదేవితో కొలిచే సంస్కృతి మనది
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ చేతుల్లోనే ఉంది
- మహిళలను బీజేపీ, బీఆర్‌ఎస్‌లు విస్మరించాయి
- మహిళలతో పెట్టుకుంటే అధికారంలో ఉండరు
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
- సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో మహిళాశక్తి మహాసభ
- 533 బస్సులను ప్రారంభించిన సీఎం
హైదరాబాద్/సికింద్రాబాద్, జూన్ 9 (విజయక్రాంతి) : ఆడబిడ్డలను లక్ష్మీదేవితో కొలిచే సంస్కృతి మనది. భూమిని భూమాతగా, దేశాన్ని భరతమాతగా, రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా భావిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆడబిడ్డల చేతిలోనే ఉందని, ఎవరెన్ని కుట్రలు చేసినా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని, అది నా బాధ్యత అని, స్వయం సహాయక సభ్యుల సంఖ్య కోటి మందికి చేరాలని పేర్కొన్నారు.
మండల మహిళా సమాఖ్యలకు కేటాయించిన 553 బస్సులను మంగళవారం సికింద్రా బాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభించి మాట్లాడారు. రూ.60 వేల కోట్ల రుణాలతో మహిళలను ఆర్థికంగా నిలబెడుతు న్నామని, వారు సంతోషం గా ఉండాలని మంచి చీరలు ఇస్తున్నామ ని, వారికి ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 553 మండల మహిళా సమాఖ్యలు రూ. 199.08 కోట్లతో 553 బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్‌ఆర్టీసీకి లీజు కు ఇచ్చాయని వెల్లడించారు.
ఒక్కో బస్సుకు నెల కు రూ.69,468 అద్దె లభిస్తుండగా, 553 బస్సుల ద్వారా మహిళా సమాఖ్యలకు నెలకు సుమారు రూ.3.84 కోట్ల ఆదా యం సమకూరుతోందని తెలిపారు. అద్దె రూపేణా ఇప్పటివరకు రూ. 20.34 కోట్ల కు పైగా మహిళా సమాఖ్యలకు అందినట్లు చెప్పారు. ఈ బస్సులు కేవలం రవాణా వాహనాలు కావని, తెలంగాణ మహిళల ఆర్థిక స్వావలంబనకు, ఆత్మవిశ్వాసానికి, యాజమాన్య హక్కులకు ప్రతీకలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
సంక్షేమం నుంచి సంపద సృష్టి వైపు మహిళలను తీసుకువెళ్లే ఆర్థిక విప్లవానికి ఇవి చిహ్నాలుగా నిలుస్తాయని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ఇప్పటివరకు రూ.308 కోట్లకు పైగా మహిళా ప్రయాణాలు నమోదయ్యాయని, మహిళలు సుమారు రూ.10,696 కోట్ల ప్రయాణ వ్యయాన్ని ఆదా చేసుకున్నారని వెల్లడించారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే కొందరు కడుపునిండా విషం నింపుకుని, కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు.
ఉచిత బస్సు రద్దు చేయాలని రోడ్డెక్కారు. అయినా వెనక్కి తగ్గకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఉచిత బస్సులో వెళ్లి మా ఆడబిడ్డలు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపని మహిళా సంఘాలకు అప్పగించాం. మహిళలలకు పెట్రోల్‌బంక్‌లు నిర్వహించేలా ప్రోత్సహించాం. అదానీతో పోటీ పడేలా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నిర్వహించేలా ప్రోత్సహించాం.
కార్పొరేట్ ఆఫీసులతో పోటీ పడేలా ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నాం. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు హైటెక్ సిటీలో 106 స్టాల్స్ ఏర్పాటు చేశాం. అమెజాన్ నుంచి ఫ్లిప్ జారీ వరకు ఆన్‌లైన్‌లో స్వయం సహాయక ఉత్పత్తులను అమ్ముకునే వెసులుబాటు కల్పించాం అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వెల్లడించారు.
8వేల మహిళా శక్తి భవనాల నిర్మాణం
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లా స్థాయిలో కార్పొరేట్ కార్యాలయాలకు సమానమైన సౌకర్యాలతో ఈ భవనాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మహిళలు పండించిన పంటలు ఇతర ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు చేర్చే లక్ష్యంతో 106 వాణిజ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ వ్యవస్థలు, గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో మహిళా సంఘాలు మరింత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మహిళల పేరునే గృహాలు, ఇతర ఆస్తుల నమోదు జరుగుతున్నదని పేర్కొంటూ మహిళల ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం, కుటుంబ స్థిరత్వానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. భవిష్యత్‌లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలక భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
నారాయణపేట జిల్లాకు చెందిన ఒక మహిళ స్వయం సహాయక సంఘం ద్వారా ఎదిగి పెట్రోల్ బంక్ యజమానిగా నిలిచిన ఉదాహరణను ప్రస్తావించిన ముఖ్యమంత్రి, వేలాది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పంట మార్పిడి విషయంలో మహిళలు చొరవ చూపాలని ఆయన సూచించారు.
మీ ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని నడిపిస్తాం
2034 వరకు మీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం.. వెయ్యి కాదు 3 వేల బస్సులకు యజమానులను చేస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.4 వేల కోట్లు సున్నా వడ్డీని ఎగొట్టి పోయిందని, ఆడబిడ్డలతో పెట్టుకున్న వారెవరైనా అధికారంలో ఉంటారా? అని ప్రశ్నించారు. మహిళలు పెట్టిన వాతలకు అధికారం దిగిపోయి కొందరు ఫామ్‌హౌస్‌లో పడుకుని ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు.
చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం మన కీర్తిని ప్రపంచానికి చాటారు. ఆడబిడ్డలకు ఓటు హక్కును కల్పించి వారి చేతికి అధికారం ఇచ్చిన ఘనత నెహ్రూది. రాష్ట్రపతిగా, మంత్రులుగా ఆడబిడ్డలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్. గత ప్రభుత్వం మొదటి ఐదేళ్లు ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏనాడు వాళ్ల పార్టీ అధ్యక్షుడిగా మహిళను నియమించలేదు.
మంత్రులుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, మునిసిపల్ మైర్మన్లుగా, మేయర్లుగా ఆడబిడ్డలు రాణించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని 2013లో సోనియాగాంధీ పార్లమెంట్‌లో బిల్లు పెట్టారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో 33 శాతం మహిళలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో ప్రధాన పాత్ర పోషించబోతున్నారు.
పారిశ్రామిక రంగాల్లోకి మహిళలు : మంత్రి సీతక్క
దేశంలోనే అత్యంత విస్తృత మహిళా సాధికారత కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘాలకు రూ.61 వేల కోట్లకు పైగా రుణాలు సమకూర్చడంతో పాటు దాదాపు రూ.2 వేల కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం భరించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మందికి పైగా మహిళలను అక్షరాస్యత కార్యక్రమాలలో భాగస్వాములను చేశామని పేర్కొన్నారు.
గ్రామీణ మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు చేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహిళలను లబ్ధిదారుల నుంచి యజమానులుగా తీర్చిదిద్దిన చారిత్రాత్మక కార్యక్రమంగా బస్సుల పంపిణీ కార్యక్రమం నిలుస్తుందనిన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి లేకుండా సమాజాభివృద్ధి సాధ్యం కాదన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, వ్యాపారాభివృద్ధి, ఆస్తి యాజమాన్యాన్ని ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కలువ సుజాత గుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు దానకిషోర్, వికాస్‌రాజ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.హరీష్ ముకుంద్‌రెడ్డి, టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, మహిళా సమాఖ్యల ప్రతినిధులు, అధికారులు, వేలాది మంది మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీ
ఎల్ నినో ఉందని వాతావరణ శాఖ చెప్పిందని, మనం 553 బస్సులను ప్రారంభించుకోగానే వరుణదేవుడు కరుణించాడని సీఎం పేర్కొన్నారు. అంతకు ముందు 553 బస్సుల అద్దె చార్జీల నిమిత్తం టీజీఎస్‌ఆర్టీసీ నుంచి మండల మహిళా సమాఖ్యలకు రూ.20.34 కోట్లు, వడ్డీ లేని రుణాలకు రూ.500 కోట్ల చెక్కును సీఎం అందజేశారు. అలాగే మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా ఆదా చేసిన రూ.10,700 కోట్ల చెక్కును అందజేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్టీసీ బస్సులో సభకు వచ్చారు.






