29 April, 2026 | 1:11 PM

బహిరంగ మార్కెట్ విలువలో సగం!

26-06-2024 01:03 AM
  1. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం
  2. నేడు సమీక్షించనున్న నూతన ఐజీ బుద్ధప్రకాశ్
  3. 29వ తేదీన అప్రూవల్ కమిటీ సమావేశం 
  4. ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త ధరలు అమలు

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో భూముల విలువతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. బహిరంగ మార్కెట్ విలువలో సగం.. అంటే సుమారు 50 శాతం పెంచుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న వాస్తవ ధరలతో పెంపు ధరలను పోల్చి రిజిస్ట్రేషన్ ధరలను సవరించాలని ప్రభుత్వ పెద్దలు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఇటీవల ఆదేశించిన సంగతి విధి తమే.

ఈ క్రమంలోనే మండల, డివిజన్, జిల్లా స్థాయిలో భూములకు బహిరంగ మార్కెట్‌లో ఉన్న విలువ వివరాలను సేకరించామని, భూముల బహిరంగ మార్కెట్ విలువను ప్రామాణికంగా తీసుకొని పెంపుపై శాస్త్రీయంగా కసరత్తు చేస్తున్నామని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొం టున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ విలువలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రభుత్వ విలువలు ఉండ టం వలన ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం జరుగుతున్నట్లు గుర్తించారు. ఉదాహరణకు కీసర ప్రాంతంలో గజం భూమి ధర సుమారు రూ.20 వేలవరకు ఉండగా, ప్రభుత్వ విలువ మాత్రం రూ.3 వేలు మాత్రమే ఉంది. నూతన ప్రతిపాదనల ప్రకారం బహిరంగ మార్కెట్ విలువలో సగం అంటే ఇప్పుడు కీసర ప్రాంతంలో ప్రభుత్వ విలువ రూ.10 వేలు అవుతుంది. అలాగే హైదరాబాద్ శివార్లలో కొన్ని చోట్ల మార్కెట్ విలువకన్నా వాస్తవ ధరలు వందల రెట్లు అధికంగా ఉన్నాయి. 

ప్రాంతం, భూముల స్వభావాన్ని బట్టి రేటు

ప్రాంతాలను, భూముల స్వభావాన్ని బట్టి భూముల మార్కెట్ విలువలో హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. నేషనల్ హైవేలు, పారిశ్రామిక వాడలు, కమర్షియల్ జోన్లు, గ్రామీణ ప్రాంతాలు, రాష్ర్ట రహదారులను ఆనుకొని ఉన్న నివాస ప్రాంతాలు, ఖాళీ స్థలాలకు ఆయా ప్రాంతాల ఆధారంగా మార్కెట్ విలువలో హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రభుత్వ ధర, బహిరంగ మార్కెట్ విలువల ఆధారంగా కొత్తగా ప్రభుత్వ మార్కెట్ విలువలను నిర్ధారించనున్నారు. అలాగే గ్రామాలు, పట్టణాల్లోని స్థానికులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ, మున్సిపల్ అధికారుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో జోనల్ డెవలప్‌మెంట్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ప్రణాళికలను పరిగణనలోకి తీసుకొని విలువలను సవరించినట్లు తెలిసింది. 

నేడు బాధ్యతలు, సాయంత్రం సమీక్ష

మండల, డివిజన్, జిల్లా స్థాయిలో వచ్చిన ప్రాథమిక మార్కెట్ విలువల ప్రతిపాదనలపై ఈ నెల 23వ తేదీన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు. అయితే ఆ శాఖ ప్రస్తుత ఐజీ నవీన్ మిట్టల్‌ను ప్రభుత్వం బదిలీ చేసి సోమవారం జ్యోతి బుద్దప్రకాష్‌ను నియమించింది. నూతన కమిషనర్ బుధవారం బాధ్యతలు స్వీకరించడంతోపాటు భూముల ధరల సవరణపై ప్రాథమిక నివేదికపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

29వ తేదీన మార్కెట్ విలువల సవరణపై అప్రూవల్ కమిటీ సమావేశమై ప్రభుత్వ పెద్దలతో చర్చించిన తర్వాత జూలై 1వ తేదీన మార్కెట్ విలువలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి జూలై 15వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అభ్యంతరాలను పరిశీలించి ప్రభుత్వ సూచనల మేరకు జూలై 24వ తేదీన రివైజ్ కమిటీ మార్కెట్ విలువలకు ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వానికి కొత్త మార్కెట్ విలువలను ఆయా జిల్లాల కలెక్టర్లు సమర్పిస్తారు. జూలై 31వ తేదీన ప్రభుత్వ ఆమోదం తెలిపిన వెంటనే నూతనంగా అమల్లోకి రానున్న మార్కెట్ విలువలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆగస్టు 1వ తేదీ నుంచి భూముల కొత్త విలువలు అమల్లోకి రానున్నాయి.