1 May, 2026 | 1:52 PM

జీవనన్నకు మంత్రి పదవి!

26-06-2024 01:01 AM

రాజీనామా ప్రకటనతో రంగంలోకి అధిష్ఠానం

మున్షీ, వేణుగోపాల్, రేవంత్‌రెడ్డి ఫోన్‌లో బుజ్జగింపులు 

ప్రభుత్వంలో తగిన గుర్తింపు ఇస్తామని హామీ 

హైదరాబాద్ వచ్చాక మాట్లాడుకుందామని స్పష్టం 

సీఎం మాటతో శాంతించిన ఎమ్మెల్సీ

మెజారిటీ ఉండగా వేరేవాళ్లు మనకెందుకు?: జీవన్‌రెడ్డి

జీవన్‌రెడ్డిని ఎప్పటికీ వదులుకోం: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, జూన్ 25 ( విజయక్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పార్టీపై అలక వీడారు. జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంతో అసంతృప్తితో రగిలిన జీవన్‌రెడ్డి  పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. తన అనుచరులతో రెండు రోజులుగా సమావేశం నిర్వహించి పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమయ్యారు.

దీంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కమార్ తదితరులు జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి బుజ్జగించారు. అయితే పార్టీ మారనని, ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేస్తానని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. వెంటనే  కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి జీవన్‌రెడ్డితో మాట్లాడారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడుకుందామని సూచించారు. 40 ఏళ్లుగా పార్టీలో సీనియర్‌గా ఉన్న జీవన్‌రెడ్డి పార్టీ మారితే తప్పుడు సంకేతాలు వెళుతాయని భావించిన అధిష్ఠానం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబును రాయబారానికి పంపి బుజ్జగింపులు చేపట్టింది.

సీఎం రేవంత్‌రెడ్డితోనూ భట్టి, శ్రీధర్‌బాబు జీవన్‌రెడ్డికి ఫోన్ చేయించారు. “అన్నా అన్ని విషయాలు హైదరాబాద్‌కు వచ్చాక మాట్లాడుకుందాం. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు వద్దు” అని రేవంత్‌రెడ్డి కూడా సముదాయించారు. తనకు నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయం లో తక్కువగా ఉండొద్దని, పార్టీ బలోపేతానికి పల్లెల్లో తిరగడానికి సిద్ధంగా ఉన్నట్లు జీవన్‌రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రేవంత్ రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వంలో సముచిత స్థా నం, గౌరవం ఉంటుందని సీఎం హామీ ఇచ్చినట్లుగా తెలిసింది. మరోసారి ఎమ్మెల్సీ పదవి ని రెన్యూవల్ చేయడంతో పాటు మంత్రివర్గంలోనూ చోటు ఉంటుందనే హామీ ఇవ్వడంతో జీవన్‌రెడ్డి శాంతించినట్టు సమాచారం.

వాళ్లు మనకెందుకు?

అయితే అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు వద్ద జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. “పార్టీలో సీనియర్ నేతగా ఉన్న తనకు తెలియకుండానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకుంటారు? పదేళ్లుగా బీఆర్‌ఎస్‌తో ఫైట్ చేస్తున్నాం. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరితే.. తెల్లారి పేపర్‌లో చూసే వరకు నాకు తెలియదు. పార్టీ కోసం కష్టపడిన తనలాంటి వారి ఆత్మాభిమానం ఏం కావాలి. కార్యకర్తల మనోభావాలు ఏం కావాలి? పార్టీ ఫిరాయింపులు చేయాల్సిన అవసరం ఏమోచ్చింది. అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ ఉండగా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు మనకెందుకు? ఫిరాయింపులతో ప్రజలకిచ్చే సంకేతం ఇదేనా?” అంటూ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. 

స్పష్టమైన హామీతో వెనక్కి..

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని భావించిన జీవన్‌రెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫోన్ చేశారు. తాను హైదరాబాద్‌లో లేనని సుఖేందర్‌రెడ్డి నుంచి సమాధానం వచ్చింది. ఆ తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి కూడా జీవన్‌రెడ్డి  ఫోన్ చేయగా, రాజీనామా లేఖను తాను తీసుకోవడానికి కుదరని ఆయన చెప్పినట్లుగా సమాచారం. అంతలోనే ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి వెనక్కి తగ్గినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

నాకు తెలియకుండానే అంతా జరిగింది

పార్టీలో తన ప్రమేయం లేకుండానే జరగాల్సిందంతా జరిగిపోయిందని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మంగళవారం మాట్లాడుతూ.. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తనకు బాధేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరనం ఏమోచ్చిందని ప్రశ్నించారు. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జీవన్‌రెడ్డి తెలిపారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాక పల్లెల్లో పర్యటిస్తానని అన్నారు. తనకు ఏ పార్టీ నుంచి ఇప్పటివరకు పిలుపు రాలేదన్నారు. పార్టీ ఫిరాయంపులకు కాంగ్రెస్ వ్యతిరేకమని, పార్లమెంట్ ఎన్నికల ముందు ఏఐసీసీ ప్రకటించిన ‘పాంచ్ న్యాయ్’లో చేర్చారని ఆయన గుర్తుచేశారు. అయితే రాష్ట్రంలో రాహుల్‌గాంధీ సూత్రానికి వ్యతిరేకంగా రాజకీయాలు నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జీవన్‌రెడ్డిని వదులుకోం: భట్టి 

జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ నేతను కాంగ్రెస్ వదులుకోవడానికి సిద్ధంగా లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే  సంజయ్ చేరిక విషయంలో జీవన్‌రెడ్డి అసంతృప్తిని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళుతామని తెలిపారు. జీవన్‌రెడ్డి నివాసం వద్ద భట్టి మంగళవారం మాట్లాడారు. “40 ఏళ్లుగా జీవన్‌రెడ్డి కాంగ్రెస్ కోసం పనిచేశారు. అధికారంలో లేని పదేళ్లు పార్టీ జెండాను భుజాన మోస్తూ భావజాలాన్ని చట్టసభలో వినిపించారు. పార్టీలో ఆయన సీనియారిటీకి భంగం కలిగించం. తగిన గౌరవం ఇస్తాం. జీవన్‌రెడ్డి అనుభవాన్ని ప్రభుత్వాన్ని నడిపేందుకు వినియోగించుకుంటాం. ఆయన మా అందరికీ మార్గదర్శకులు.  సంజయ్ చేరిక అంశంపై పార్టీలో అందరం కలిసి చర్చిస్తాం. పార్టీలో సీనియర్ నాయకులు మనస్థాపం చెందితే మేమందరం బాధపడుతాం” అని భట్టి విక్రమార్క అన్నారు.