26 March, 2026 | 2:26 PM

డీఆర్టీ ఉత్తర్వులపై హైకోర్టుకు ఎన్టీఆర్

17-05-2024 12:56 AM

ఆ ఆదేశాలను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): జాబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 2007లో స్థలం కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టిన ఇంటిపై బ్యాంకులకు హక్కులు ఉన్నాయని డీఆర్టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్) ఇచ్చిన తీర్పును సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. బ్యాంకులకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ ఎన్టీఆర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం విచారించింది.

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 881 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2007లో జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసి చట్టప్రకారం అన్ని అనుమతులు పొందాక ఇంటి నిర్మాణం చేపట్టారని తెలిపారు. 1996లోనే ఈ స్థలాన్ని తనఖా పెట్టి ఇంటి జాగాపై రుణం పొందారని, ఈ లోన్ చెల్లించని కారణంగా ఆ ఆస్తిపై హక్కులు తమవేనని పేర్కొంటూ ఎస్బీఐ, ఓబీసీ, ఇండస్‌ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు నోటీసులు ఇచ్చాయని చెప్పారు.

ఈ నోటీసులను సవాలు చేస్తూ పిటిషనర్ డీఆర్టీని ఆశ్రయించారని, దీనిపై సమగ్ర వివరాలు పరిశీలన చేయకుండానే డీఆర్టీ ఆదేశాలు ఇచ్చిందన్నారు.  స్థలాన్ని అమ్మిన వారిపై కేసు పెట్టినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు మరో వారంలో ఇస్తామన్నారు. దీనిపై విచారణను వచ్చే వారానికి వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. జూన్ 3లోగా డీఆర్టీ ఉత్తర్వులను సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.