13 May, 2026 | 2:10 AM

హనుమాన్ జయంతి పర్వదినం.. భక్తిశ్రద్ధల సమాహారం

13-05-2026 01:10 AM

ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యత అవసరం

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం, మే 12, (విజయక్రాంతి): హనుమాన్ జయంతి పర్వదినం భక్తిశ్రద్ధల సమాహారమని, ఆధ్యాత్మికతతో పాటు ప్రతి ఒక్కరిలో సామాజిక బాధ్యత పెరగాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయాలను ఆయన సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో హనుమంతుడు ధైర్యానికి, నిస్వార్థ భక్తికి నిలువుటద్దమని కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసినప్పుడే ధర్మ రక్షణ సాధ్యమవుతుందని, ఆ దిశగా ఆలయ కమిటీలు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణను ఆయన ప్రారంభించి, నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు దేవాలయ కమిటీలు ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, నాయకులు మొహమ్మద్ యూసుఫ్, బోయిన విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.