ఇసుక రీచ్‌పై వివాదం?
వీరాపురంలో రెండు గిరిజన సొసైటీల మధ్య గొడవ
తమకే హక్కులు ఉన్నాయని ఇరు వర్గాల వాదన
పినపాక, జూలై 1 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వీరాపురం ఇసుక రీచ్ కేటాయింపు అంశం రెండు గిరిజన మహిళా ఇసుక సహకార సంఘాల మధ్య వివాదానికి దారితీసింది.
ఒకవైపు అన్ని ప్రభుత్వ అనుమతులు తమకే లభించాయని శ్రీరామ మహిళా ఇసుక క్వారీ ట్రైబల్ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం వాదిస్తుండగా, తమ పాత సంఘ హక్కులను పక్కనపెట్టి ఏకపక్షంగా వ్యవహరించారని మరో శ్రీగిరి లక్ష్మి గిరిజన మహిళా సహకార సంఘం ఆరోపిస్తోంది. దీంతో ఇసుక రీచ్ వివాదం రెండు గిరిజన మహిళా సంఘాల మధ్య వివాదం తలెత్తింది.
‘పాత సంఘ హక్కులను విస్మరిస్తున్నారు: శ్రీగిరి లక్ష్మి సొసైటీ‘
1964 సహకార సంఘాల చట్టం కింద నమోదైన ‘శ్రీగిరి లక్ష్మి ఇసుక క్వారీ ట్రైబల్ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం లిమిటెడ్‘ సభ్యులు మాత్రం తమ సంఘం ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ అనుమతులతో ఇసుక కార్యకలాపాలు నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతోందని తెలిపారు. పంచాయతీల పునర్విభజన జరిగినప్పటికీ సంఘ సభ్యుల హక్కులు కొనసాగుతున్నాయని, ఈ అంశంపై హైకోర్టు కూడా తమ హక్కులను గుర్తించిందని పేర్కొన్నారు.
అన్ని అనుమతులు తమకే వచ్చాయి
శ్రీరామ సొసైటీ...
పంచాయతీల పునర్విభజన అనంతరం వీరాపురం రెవెన్యూ గ్రామానికి చెందిన గిరిజన మహిళలతో ‘శ్రీరామ మహిళా ఇసుక క్వారీ ట్రైబల్ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం2025‘ ఏర్పాటు చేసినట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ సంఘానికి టీఎస్‌ఎండీసీ, ఐటీడీఏ పీవో, పినపాక తహసీల్దార్, దుగినేపల్లి గ్రామపంచాయతీ తీర్మానం తదితర అధికారిక అనుమతులు లభించాయని పేర్కొన్నారు. 1.85 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతి మంజూరైందని, అయినప్పటికీ పక్క పంచాయతీకి చెందిన శ్రీగిరి లక్ష్మి సొసైటీ సభ్యులు పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
వీరాపురంర్పీ ఏ సొసైటీ పేరు లేదని వాదన.
2025 మే 19న డీఎల్‌ఎస్సీ ఆమోదించిన ఉత్తర్వుల్లో ‘వీరాపురం రీచ్‘ మాత్రమే పేర్కొన్నారని, ఏ సొసైటీ పేరూ లేదని శ్రీగిరి లక్ష్మి సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో కలెక్టర్, డీసీవో, టీఎస్‌ఎండీసీ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపింది.
గ్రామపంచాయతీ తీర్మానంపై అభ్యంతరాలు..?
రెండు సొసైటీలు ఉన్నాయని అధికారులు గుర్తించినప్పటికీ, తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా గ్రామపంచాయతీ ఏకపక్షంగా శ్రీరామ సొసైటీకి అనుకూలంగా తీర్మానం పంపిందని శ్రీగిరి లక్ష్మి సంఘం ఆరోపించింది. గ్రామసభ నిర్వహించారా లేదా అన్న దానిపై కూడా స్పష్టత లేదని పేర్కొంది.
సమాన అవకాశం కల్పించాలని డిమాండ్.
వివాదం పూర్తిగా పరిష్కారమయ్యే వరకు వర్క్ ఆర్డర్ జారీ చేయవద్దని, రెండు సంఘాలకు సమాన అవకాశాలు కల్పించాలని, గిరిజన మహిళల జీవనోపాధి దెబ్బతినకుండా న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని శ్రీగిరి లక్ష్మి సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
అధికారిక అనుమతులను గౌరవించాలీ
శ్రీరామ మహిళా ఇసుక క్వారీ సంఘం చైర్మన్ తరఫున విడుదల చేసిన ప్రకటనలో, 2025లో సంఘం అధికారికంగా నమోదు కాగా, 2026 జూన్ 23న జిల్లా కలెక్టర్, టీఎస్‌ఎండీసీ, ఐటీడీఏ పీవో, గ్రామపంచాయతీ తీర్మానాల ఆధారంగా 1,85,500 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతులు లభించాయని పేర్కొన్నారు. అధికారుల నిర్ణయాన్ని గౌరవించి తమ సంఘానికి న్యాయం చేయాలన్నారు.
- శ్రీరామ సొసైటీ చైర్మన్ పిట్టల నాగరాణి
దుగినేపల్లి గ్రామ సర్పంచ్ గుండపు కిరణ్ కుమార్ ఏమన్నారంటే..
దుగినేపల్లి గ్రామ సర్పంచ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, పంచాయతీల విభజన అనంతరం దుగినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వీరాపురం రెవెన్యూ గ్రామంలో ఉన్న ఏకైక గిరిజన ఇసుక సహకార సంఘం ‘శ్రీరామ మహిళా ఇసుక లేబర్ కాంట్రాక్ట్ సంఘమే‘ నని తెలిపారు. పంచాయతీ పరిధిలో ప్రస్తుతం ఇదే అధికారికంగా ఉన్న సంఘమని ఆయన వివరించారు. ఇది ఇలా ఉండగా రెండు వర్గాలు చేసిన వాదనలు, ఆరోపణలు నేపథ్యంలో సంబంధిత అధికారులు తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.






