11 July, 2026 | 3:50 AM

ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు విఫలం

11-07-2026 02:39 AM
  1. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాళేశ్వరం కూలేశ్వరం అయింది
  2. కమీషన్ల కోసమే ప్రాజెక్టు డిజైన్ మార్చారు
  3. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్, జూలై 10 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నే కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని రా మస్వామి గుట్ట వద్ద 110 ఎకరాలలో 125 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇండ్ల మోడల్ కాలనీలో రూ.20 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్, అంగన్ వాడి భవనం, కమ్యూనిటీ హాల్, సిసి రోడ్లు, డ్రైన్స్, వీధి లైట్లు, పిల్లల ఆటస్థలం, షాపింగ్ కాంప్లెక్స్, ఆర్చ్‌లకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాం లో కమీషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చి ఇసుక దిబ్బల మీద కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మా ర్చారని ఎద్దేవా చేశారు. కాలేశ్వరం బ్యారేజ్ అక్కడ నిర్మించవద్దని అధికారులు, నిపుణులు సూచించిన కూడా వాటిని పట్టించుకోకుండా బ్యారేజ్ నిర్మాణం చేశారన్నారు. నేషనల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు కాలేశ్వరం ప్రాజెక్టులో నీరును నింపడం లేదని అన్నారు.

కాలేశ్వరంలో నీటిని స్టోరేజ్ చేస్తే కింద గ్రామాలు కొట్టుకొని పోతాయని నిపుణుల సూచనలు పాటిస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు విఫలమైనందున ఆయను కేసీఆర్ పక్కన పెట్టిండని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత చెప్పినట్లుగా కాలేశ్వరం కమీషన్ 1400 కోట్లు బీఆర్‌ఎస్ పార్టీకి చెక్కు రూపంలో అందిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసిన కెసిఆర్ కుటుంబం మళ్లీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.