రామోజీరావు జీవితం అందరికీ ఆదర్శం
హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు పార్థివ దేహానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరుహరీశ్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు అన్నారు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శం ఆయన నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన అని హరీశ్ కొనియాడారు.
తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు చిరస్మరణీయులన్నారు. పత్రిక, టీవీ, సినిమా తదితర రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణం స్మరించుకున్నారు. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారని, సమాజ హితం కోసం మీడియా ద్వారా కృషి చేశారన్నారు. ఏ రంగంలో అడుగుపెట్టినా.. తనదైన ముద్ర వేశారు. ప్రతి వ్యాపారంలో అగ్రగామిగా నిలిచారు. ఒక చిరుద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రామోజీ రావు.. వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఎంతో మంది కుటుంబాల్లో వెలుగు నింపారని ఆయన పేర్కొన్నారు.
తెలుగు భాషను కాపాడేందుకు ఆయన చేసి కృషి ఎంతో గొప్పదన్నారు. జర్నలిజం, సాహిత్య రంగాల్లో ఆయన చేసిన కృషి గొప్పది. సమాజ సేవ చేసి ఎంతో మంది గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు హరీశ్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీ రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు.






