08-12-2025 12:29:51 PM
టార్గెట్ రేవంత్..
కాంగ్రెస్ పాలనలో ఆర్గనైజ్డ్ కరప్షన్
హైదరాబాద్: ఐటీఐ, ఐటీ, ఐఐటీకి తేడా తెలియని ముఖ్యమంత్రి(Chief Minister Revanth Reddy) మనకు దొరికారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్(Telangana Bhavan)లో నిర్వహించిన మీడియా సమావేశం అన్నారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారు.. ఇచ్చారా.. పిల్లలు పుట్టాక కల్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం కల్యాణలక్ష్మి కింద రూ. 980 కోట్లు బకాయి పడిందని లెక్క చెప్పారు. అందాల పోటీలు పెట్టి రాష్ట్రం పరువు తీశారు. పోటీ నుంచి మధ్యలోనే తప్పుకుని మిస్ ఇంగ్లండ్ వెళ్లిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హామీలు, అభివృద్ధి ఏదీ జరగలేదని వివరించారు. ప్రభుత్వ పాలన నిస్సారం, నిష్ఫలం, నిరర్ధకం అన్నారు. కేసీఆర్ ప్రారంభించిన పథకాలన్నీ అటకెక్కించారని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో జరిగిందల్లా ఆర్గనైజ్డ్ కరప్షన్ అని హరీశ్ ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వంలో కొత్త ట్యాక్సు కట్టాల్సి వస్తోందన్నారు. ప్రతీ స్కీంలోనూ స్కాం ఉందన్నారు. 6 గ్యారెంటీల్లో మహలక్ష్మికే దిక్కులేదన్నారు. కోటి మంది అక్కాచెల్లెల్లలో ప్రతీ ఒక్కరికి రూ 60 వేలు బాకీ పడ్డారని సూచించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చి దిద్దితే, రేవంత్ రెడ్డి తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడని హరీశ్ రావు మండిపడ్డారు. కేసీఆర్ ప్రతి ఊరికి పల్లె దవాఖానాలు, పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు కడితే, రేవంత్ రెడ్డి ప్రతి ఊరికి ఒక బారు, పబ్ పెట్టుకోమన్నారని హరీశ్ ఫైర్ అయ్యారు. ప్రజా భవన్‌ను జల్సాలకు, విందులకు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా భవన్ లో పొద్దుగాల బ్రేక్‌ఫాస్ట్ మీటింగులు, మధ్యాహ్నం సెటిల్‌మెంట్లు, సాయంత్రం గానా భజానాలు, సంగీత్‌లు, ఎంగేజ్‌మెంట్లు, విందులు వినోదాలు జరుగుతున్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క రోజు మాత్రమే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారని, నాలుగైదు రోజులు మంత్రులు వచ్చారని, ఆ తర్వాత వాళ్లు కూడా పత్తా లేరన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని మొదటి కార్యక్రమం, రేవంత్ రెడ్డి మొదటి మాటే తుస్సుమందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి జరుపుకోవాల్సినవి విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలని హరీశ్ సూచించారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డివి బ్లాక్ మెయిల్ రాజకీయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను మోసం చేసిందని, రెండేళ్లలో జర్నలిస్టులక ఏం చేశారో ఒక్కటి చెప్పండి? అని హరీశ్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ కట్టించిన బిల్డింగ్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రెండేళ్లలో ఒక్క అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, జర్నలిస్టుల సంక్షేమాలకు రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి అయినా ఇచ్చావా? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.