08-12-2025 10:30:05 AM
ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం.
కాంగ్రెస్ శ్రేణులు మద్దతు కలిసొచ్చేనా.
చిట్యాల(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) చిట్యాల మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతుంది.నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు.ఆ వెంటనే అధికార పార్టీకి చెందిన కట్కూరి పద్మనరేందర్ స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రచారాన్ని మొదలుపెట్టారు.మరోవైపు ప్రతిపక్షానికి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి తౌటం లక్ష్మి ముందు నుంచే యువకులు,ప్రజలతో చర్చలు మొదలుపెట్టారు.ఉదయం లేవగానే జనాల కూడలిలా వద్ద ఇద్దరు అభ్యర్థులు జోరుగా ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
ఇద్దరు అభ్యర్థులు బలమైన వారు కావడంతో చిట్యాల మండలకేంద్రం వైపు ప్రతి ఒక్కరి దృష్టి మళ్లింది.అయితే అధికార పార్టీకి చెందిన కట్కూరి పద్మ నరేందర్ గతంలో ఎంపీటీసీగా సేవలందించారు.పదవి ముగిసిన అనంతరం కొన్ని రోజులగా రాజకీయంలో సైలెంట్ గా ఉండి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.జిల్లా పెద్దలు గమనించి పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కట్కూరి పద్మనరేందర్ ను కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు.దీంతో స్థానిక కాంగ్రెస్ శ్రేణుల నుంచి పూర్తి మద్దతు లభించడంతో పోరు రసవత్తరంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇద్దరి అభ్యర్థులకు యువత నుంచి చెరి సమానంగా మద్దతు లభిస్తూ ఉండడంతో ఓటర్ నాడీ అంతుచికడం లేదని కొంతమంది చర్చిస్తుండగా మరి కొంత మంది కాంగ్రెస్ వైపు వార్ వన్ సైడ్ అవుతుందని భావిస్తున్నారు.
కీలకం కానున్న యువకుల ఓట్లు.
చిట్యాల మండలకేంద్రం నుంచి పోటీ చేస్తున్న కట్కూరి పద్మనరేందర్,తౌటం లక్ష్మి లకు యువకుల నుంచి సమానంగా ఫాలోయింగ్ ఉంది.దీన్ని క్యాచ్ చేసుకొని ఓటర్లను మంచిగా చేసుకునే పనిలో ఇద్దరు అభ్యర్థులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అయితే గతంలో కేవలం మూడుసార్లు మాత్రమే పాత చిట్యాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు మాత్రమే గెలుపు చూశారు. తర్వాత ఇప్పటివరకు పాత చిట్యాలకు సర్పంచి పదవి దక్కలేదు.ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణుల స్ట్రాటజీ చిట్యాలకు కలిసి వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.
స్థానిక ఎమ్మెల్యేతో రోడ్ షో?
చిట్యాల మండలకేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో రోడ్ షో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ కావడంతో ఈ రోడ్ షో కట్కూరి పద్మ నరేందర్ కు కలిసి వస్తోందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. ఇందులో కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన హామీలు ఎమ్మెల్యే తెలియజేయనున్నట్లు కాంగ్రెస్ శ్రేణుల నుంచి వినిపిస్తుంది. ప్రస్తుతం కట్కూరి పద్మ నరేందర్ కు కాంగ్రెస్ శ్రేణుల సహకారం పూర్తిగా లభిస్తుండగా ఈ అంశం కలిసి వస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.