6 వేల పింఛన్ వచ్చేదాకా ఊరుకునేది లేదు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, దివ్యాంగుల హక్కుల సాధనకై బీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం, హస్తినాపురంలో “సమర శంఖారావం” పూరించారు. సుధీర్ రెడ్డి మోగించిన సమరభేరి ఆగేదికాదన్న బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు(Harish Rao) 6 వేల పింఛన్ వచ్చేదాకా ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు సరిగా అమలు కావడం లేదని హరీశ్ రావు మండిపడ్డారు. కేసీఆర్ కాలంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పై రూ 2,700 కోట్లు ఖర్చు చేశారని లెక్కచెప్పారు.
రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వంలో రూ. 800 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. ఒక్కొక్క దివ్యాంగుడు ఒక్కొక్క శక్తివంతుడన్న హరీశ్ రావు దివ్యాంగులను హేళన చేసిన వాడే అసలైన దివ్యాంగుడని హెచ్చరించారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద దివ్యాంగుల తరపున నిరసన కార్యక్రమాలు చేపడతామని హరీశ్ రావు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సర్కార్ దేశంలో దివ్యాంగుల చట్టాన్ని అమలు చేసి ఇండియాలో ది బెస్ట్ స్టేట్‌గా అవార్డ్ సాధించిందని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు రూ.500 ఉన్న పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచారని చెప్పారు. సంక్షేమ పథకాలలో హౌసింగ్‌లో 5శాతం రిజర్వేషన్, విద్య ఉద్యోగాలలో 4శాతం రిజర్వేషన్ కల్పించారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా అమలుచేయలేదని హరీష్ రావు ఆరోపించారు.






