దోమకొండ బీటీఎస్ వద్ద అండర్‌పాస్ వంతెనకు హామీ
స్థలాన్ని పరిశీలించిన ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
దోమకొండ, ఆగస్టు 29 (విజయ క్రాంతి): దోమకొండ–బీటీఎస్ చౌరస్తా వద్ద అండర్‌పాస్ వంతెన, రహదారి విస్తరణ పనులకు త్వరలోనే మంజూరు ఇప్పిస్తామని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. శనివారం ఎన్‌హెచ్‌ఏఐ పీడీ నాగేశ్వరరావుతో కలిసి వారు అండర్‌పాస్ నిర్మాణం చేపట్టాల్సిన ప్రాంతాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ సభ్యుడు తీగల తిరుమల్‌గౌడ్, దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య వంతెన సమస్యను ఎంపీ, ప్రభుత్వ సలహాదారుల దృష్టికి తీసుకెళ్లారు. దోమకొండ–బీటీఎస్ చౌరస్తా వద్ద ప్రయాణికులు, బస్సులు, భారీ వాహనాలకు అనుకూలంగా వంతెన లేకపోవడంతో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రహదారి దాటేందుకు ప్రయాణికులు సుమారు కిలోమీటరు దూరం వెళ్లాల్సి వస్తోందని, బస్సులు, భారీ వాహనాలు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించి యూటర్న్ చేసుకోవాల్సి వస్తోందని వివరించారు.దోమకొండ చౌరస్తా మీదుగా కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలకు చెందిన ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని, అండర్‌పాస్ లేకపోవడంతో స్థానికులతో పాటు అంతర్‌జిల్లా ప్రయాణికులు సైతం దూరభారం, వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అండర్‌పాస్ వంతెనతో పాటు రహదారి విస్తరణ పనులు చేపట్టాలని కోరారు.
అండర్‌పాస్ నిర్మాణంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం ఇరువైపులా బస్ షెల్టర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రహదారి వెంట ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.సమస్యలను విన్న ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ త్వరలోనే సర్వే నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ పీడీ నాగేశ్వరరావును ఆదేశించారు. అండర్‌పాస్ వంతెన, రహదారి విస్తరణ పనులకు త్వరలోనే మంజూరు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గత రెండేళ్లుగా అండర్‌పాస్ వంతెన నిర్మాణం కోసం ఎంపీ, ప్రభుత్వ సలహాదారు, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రాలు అందజేశామని మాజీ జడ్పీటీసీ సభ్యుడు తీగల తిరుమల్‌గౌడ్ తెలిపారు. తమ విజ్ఞప్తికి స్పందించి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన ఎంపీ, ప్రభుత్వ సలహాదారులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కటిక శ్రీనివాస్, నాయకులు సీతారాం మధు, నేతుల సుధాకర్, మల్లేశం, మహమూద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






