29-12-2025 01:12:43 PM
పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు(Telangana Assembly Winter Session) ప్రారంభమయ్యాయి. సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
ఎన్నికల్లో ప్రభుత్వోద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినంక గాలికి వదిలేశారని హరీశ్ రావు మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని కోరారు. పింఛన్ బకాయిలు రావట్లేదని 39 మంది విశ్రాంత ఉద్యోగులు మరణించారని వెల్లడించారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సమాధానం ఇస్తూ... ఉద్యోగుల గురించి హరీశ్ రావు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. హరీశ్ రావు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని చమత్కరించారు. సభ్యులు విజ్ఞప్తులు పరిగణలోకి తీసుకుంటామని శ్రీధర్ బాబు సూచించారు. గత బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని మంత్రి వెల్లడించారు.