29-12-2025 01:25:05 PM
తంగళ్ళపల్లి, విజయక్రాంతి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామ ఉపసర్పంచ్ పుట్ట భాను, వార్డు మెంబర్లు, వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సమక్షంలో జరిగాయి. సిరిసిల్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కొత్తగా చేరిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ గ్రామాలను అన్ని విధాలుగా ముందుకు నడిపించేందుకు కృషి చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రజా పాలనపై నమ్మకంతో గ్రామాభివృద్ధి లక్ష్యంగా పార్టీకి చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో చేరినవారిలో గండి లచ్చపేట ఉపసర్పంచ్ పుట్ట భాను, వార్డు సభ్యులు కుక్కల ఉమా, బామ్మగారి వజ్రవ్వ, బల్లెపు జలంధర్, బామ్మగారి పరుశురాములు, బల్లెపు నరసయ్య, బల్లెపు సత్తయ్య, కర్రోళ్ల రాములు, కుక్కల సుధాకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కర్రల బాలయ్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్, పూర్మాని రాం లింగారెడ్డి, వెంకట్ రెడ్డి, గంగాధర మహిపాల్, ఇందిరమ్మ కాలనీ మాజీ సర్పంచ్ బైరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.