16 April, 2026 | 2:59 AM

మంత్రి ఉత్తమ్‌కి లేఖ రాసిన హరీశ్ రావు

15-06-2025 03:23 PM

హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర సాగునీటికి సంబంధించిన అంశాలపై లేఖ రాసిన హరీశ్ రావు గోదావరి-బనకచర్లపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. వీలైనంత త్వరలో అఖీల పక్ష సమవేశం ఏర్పాటు చేయాలని, ప్రత్యేక శాసనసభ సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. అందరి అభిప్రాయాలతో ఒక విధానపర నిర్ణయం తీసుకోవాలని, గోదావరి-బనకచర్లతో తెలంగాణ వాటాకు గండిపడే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇంకా ఇవ్వలేదని, బనకచర్లను కేంద్రం అనుమతిస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని హరీశ్ రావు వెల్లడించారు.  తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 969 టీఎంసీలపై హక్కులు ఇంకా సాధించుకోలేదని, ఆంధ్రప్రదేశ్ చేపట్టే ఏ కొత్త ప్రాజెక్టైనా అనుమతి ఇస్తే అది ఆత్మహత్యా సదృశ్యమే అని ఆయన అన్నారు. బనకచర్లతో ఏపీ 200 టీఎంసీలను తరలించాలని చూస్తోందని, కృష్ణానదిలో 112.5 టీఎంసీలు రాష్ట్రానికి కేటాయించాలని కోరాలని సూచించారు. ఈ వాటాకు ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తే బనకచర్లను పరిశీలించవచ్చాని ఇంజనీర్లు భావిస్తున్నారని హరీశ్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాలపై శ్రద్ధ పెట్టి తగు చర్యలు తీసుకోవాలని, రాజకీయాలకు తావులేకుండా కృషి చేస్తే బీఆర్ఎస్ తోడుగా ఉంటుందని హరీశ్ రావు లేఖలో చెప్పారు.