తెలుగు చిత్రపరిశ్రమకు హ్యాట్సాఫ్
డాక్టర్ దాసరి స్మారక జాతీయ అవార్డు గ్రహీత బాల్కి
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని ‘డైరెక్టర్స్ డే’గా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (టీఎఫ్‌డీఏ) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహిం చిన ఈ కార్యక్రమానికి భారత చలనచిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా అలనాటి తారాతోరణంతో ఈ వేదిక శోభిల్లింది. ఈ వేదికపై పలు భాషలకు చెందిన ప్రముఖ దర్శకులను ‘డాక్టర్ దాసరి స్మారక జాతీయ అవార్డు’తో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ.. “హిందీ చిత్ర దర్శకుడు బాల్కికి డాక్టర్ దాసరి మెమోరియల్ నేషనల్ అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది. తండ్రిలాంటి దాసరి లేరనే లోటు నాకు ఈ జీవితాంతం ఉంటుంది. దర్శకుడు అనే పదానికి అర్థం చెప్పిన ఏకైక వ్యక్తి దాసరి. చిత్రసీమ ఉన్నంత వరకు దాసరి పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. మా యూనివర్సిటీలో దాసరి పేరు మీద ఆడిటోరియం కట్టాం.
తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కు రూ.15 లక్షలు ఆర్థిక విరాళాన్ని అందిస్తా” అని అన్నారు. దాసరి మెమోరియల్ అవార్డు గ్రహీత బాల్కి మాట్లాడుతూ.. ‘ఇప్పుడు ఇండియానకు సెంటర్‌గా టాలీవుడ్ ఉంది. ఆదర్శంగా నిలుస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు హ్యాట్సాఫ్” అని అన్నారు. జయప్రద, జయసుధ , దర్శకుడు ఎన్ శంకర్, ఎస్వీ కృష్ణా రెడ్డి, వల్లభనేని అనిల్, వీర శంకర్, చదలవాడ శ్రీనివాసరావు, పీజీ విందా, తదితరులు కూడా ఈ వేదికపై మాట్లాడారు. దాసరి సేవలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.






