పెద్ద చెరువుపై వాలిన గద్దలు
రోజుకింత చిన్నబోతున్న పీర్జాదిగూడ పెద్ద చెరువు
ఎన్నికల విధులలో అధికారులు
ఇదే అదనుగా చెరువులోకి... చొచ్చుకొచ్చిన కబ్జాదారులు
కొన్నింటిని కూల్చిన అధికారులు మరికొన్నింటికి మినహాయింపు
అధికారుల తీరుపై అనుమానాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (విజయక్రాంతి) ః ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్లుగా ఉంది మేడ్చల్ జిల్లా పరిధిలోని మేడిపల్లి రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారుల తీరు. ప్రభుత్వానికి నష్టం జరిగితే మాకేంటి? మా జేబులు నిండితే చాలన్న చందంగా అధికారులు వ్యవహరిస్తుండటంతో పీర్జాదిగూడ పెద్ద చెరువుపై ఆక్రమణదారులు రాత్రికి రాత్రే గద్దల్లా వాలుతున్నారు. దీంతో పీర్జాదిగూడ ప్రాంతంలోనే పెద్ద చెరువుగా పిలుచుకునే పీర్జాదిగూడ పెద్దచెరువు రోజురోజుకు చిన్నబోతోంది.
2024 మే 14వ తేదీ వరకు ప్రభుత్వ అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటం కబ్జాదారులకు మరింత కలిసొచ్చింది. ఇదే అదనుగా భావించిన ఆక్రమణదారులు స్థానిక నాయకుల అండదండలతో చెరువు స్థలంలోకి చొచ్చుకొస్తునారు. ఈ ఆక్రమణలు ఇలానే కొనసాగితే పెద్ద చెరువు కాస్త చిన్న కుంటగా మారే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీర్జాదిగూడ పెద్ద చెరువు ఆక్రమణలపై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం.
కొన్నింటినే కూల్చారు
మేడిపల్లి మండల రెవెన్యూ పరిధిలో సుమారు 34.11 ఎకరాలలో పెద్ద చెరువు విస్తరించి ఉంది. ప్రస్తుతం ఈ చెరువు విస్తీర్ణం కేవలం 20 ఎకరాలు కూడా లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. గతంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ శంకర్ నగర్‌లో చెరువు ఏఫ్టిఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నట్లు స్థానికులు, ప్రజా సంఘాలు.. ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులకు ఫిర్యాదు చేశారు.
చెరువు ఆక్రమణలతో పాటు అధికారుల తీరుపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఒకటి రెండు నిర్మాణాలను నేలమట్టం చేసి మమ అనిపించారు. మరికొన్ని అక్రమ నిర్మాణాలను అలాగే వదిలేశారు. ఈ అక్రమ నిర్మాణాల కారణంగా చెరువులో నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గుతోందని, వర్షా కాలంలో చెరువులోని నీరు కాలనీల్లోకి ముంచెత్తడంతో ఇండ్లలోకి నీరు వస్తోందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
కేసులైనా మారని తీరు
గతంలో ఇదే పెద్ద చెరువు భూమిలో కబ్జాలకు పాల్పడుతున్నట్లు అధికారుల విచారణలో తేలడంతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుల మేరకు కబ్జాదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే చెరువు ఆక్రమణదారుల వెనుక స్థానిక అధికార పార్టీ నాయకుడు ఉండటంతో పోలీసులు ఆ కేసును పక్కన పెట్టారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఆ నాయకుడి అండతో యథేచ్ఛగా చెరువు ఎఫ్టీఎల్ స్థలాన్ని ఆక్రమించి జోరుగా నిర్మాణాలు చేస్తున్నారు. రాత్రి సమయంలో మట్టి పోస్తూ కబ్జాలకు తెగబడుతున్నారు. అంతటితో ఆగకుండ అక్రమ నిర్మాణాలను కారుచౌకగా ఇతరులకు విక్రయించి అందినకాడికి దండుకుంటున్నారు. అయితే బహిరంగంగానే చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా ఇరిగేషన్, రెవిన్యూ, మున్సిపల్ అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహారిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.
కోర్టు దృష్టిలోకి ఆక్రమణలు
రాష్ర్టంలోని చెరువులు, కుంటలు, నాలాలను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలని ప్రభ్వుత్వానికి సూచిస్తూ గతంలో రాష్ర్ట సర్వోన్నత న్యాయస్థానం చెరువుల సంరక్షణ, అభివృద్ధిపై అధ్యాయనానికి ఓ కమిటీని నియమించింది. డిప్యూటీ సొలిసీటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రవీణ్ కుమార్, రెవెన్యూ ప్రభుత్వ ప్లీడర్ టి.శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ సభ్యుల బృందం అన్ని ప్రాంతాలతో పాటు పీర్జాదిగూడ పెద్ద చెరువు సందర్శించి చెరువు ఆక్రమణలతో పాటు చేసిన అభివృద్ది, చెరువు సంరక్షణకు తీసుకున్న చర్యలపై ఆరా తీసింది. ఈ చెరువు కబ్జాల వ్యవహారంపై మేడిపల్లి ఎమ్మార్వోను విజయక్రాంతి ప్రతినిధి ఫోన్‌లో సంప్రదించగా ఎమ్మార్వో స్పందించలేదు.
రూ.15 కోట్లతో అభివృద్ది
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ చెరువు చుట్టూ కాలనీలు విస్తరించడంలో స్థానిక ప్రజల సౌకర్యార్థం మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ది చేయాలని గతంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చెరువు సంరక్షణ, ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులతో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ది చేసింది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ చెరువు కట్టపై కొన్ని వేల మంది వాకింగ్ చేస్తారు. పార్కులు, చిల్డ్రన్ ప్లే ఏరియాతో పాటు అందమైన గ్రీనరీతో నిర్మించిన పార్కులలో ప్రజలు సందడిగా గడుపుతుంటారు.




