10 ఏళ్ల శిక్ష సరైనదే
దక్కన్ కాలేజీ కాల్పుల కేసులో హైకోర్టు తీర్పు
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): దారుస్సలాంలోని దక్కన్ ఇంజినీరింగ్ కాలేజీలో 2007 కాల్పుల కేసులో మహమ్మద్ ఉమీదుల్లా ఖాన్‌కు విధించిన 10 ఏళ్ల జైలును హైకోర్టు సమర్థించింది. పదేళ్ల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ కింది కోర్టు విధించిన తీర్పును కొట్టివేయాలంటూ ఉమీదుల్లా దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. కాల్పుల సంఘటనను ప్రాసిక్యూషన్ నిరూపించిందని తేల్చింది. ఈ ఘటనపై 2013లో విచారణ చేపట్టినపుడు సాక్ష్యాధారాల్లోని చిన్నపాటి లోపాలున్నాయని చెప్పి ప్రాసిక్యూషన్‌ను తప్పుపట్ట లేమని వెల్లడించింది. '
ప్రాసిక్యూషన్ సమర్పించిన కీలక సాక్షుల్లో ముగ్గురు బాధితు డికి చెందిన వ్యక్తులేనని ఉమీదుల్లా తరఫు లాయర్ చేసిన వాదనను తప్పుపట్టారు. కాల్పులు జరిగాక సంఘటనా స్థలానికి వెళ్లిన అప్పటి కార్వాన్ ఎమ్మెల్యే గన్‌మెన్ సాక్ష్యం సంఘటనను ధ్రువీకరిస్తోందన్నారు. పిటిషనర్ చేతిలో రివాల్వర్ ఉన్నట్లుగా కాల్పుల్లో గాయపడిన సిద్ధిఖీ చెప్పడం సంఘటనను నిర్ధారణ చేస్తోందన్నారు. కాల్పులు జరిపిన పిటిషనర్ బీటెక్ రెండో ఏడాది చదువున్నాడని, అందువల్ల రివ్యాలర్‌తో కాల్పులు జరిపితే ఏం జరుగుతుందో తెలిసే ఉంటుందని, బాధితుడిని చంపాలన్న ఉద్దేశం ఉన్నట్లు స్పష్టం అవుతోందన్నారు.




