5 August, 2026 | 1:53 AM

హెచ్‌సీఏ జిల్లా విస్తరణ అక్రమం : టీసీఏ

05-08-2026 12:00 AM
  1. కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు
  2. తెలంగాణ క్రికెట్‌ను బలి చేస్తున్నారు : గురువారెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 4 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జిల్లా విస్తరణ కార్యక్రమంపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. జిల్లా విస్తరణ అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. న్యాయస్థానం ఆదేశాలను పక్కదారి పట్టించడం, బీసీసీఐ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం హెచ్‌సీఏకు అలవాటుగా మారిందని టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సింగిల్ మెంబర్ కమిటీ ఛైర్మన్ జస్టిస్(రిటైర్డ్) పి.నవీన్‌రావు, హెచ్‌సీఏ సెక్రటరీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా విస్తరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గతంలో బాంబే హైకోర్టు, బీసీసీఐ ఇచ్చిన ఆదేశాలను ముందుగా అ మలు చేయకుండా ఈ ప్రక్రియను చేపట్టడంపై మండిపడ్డారు. కొందరి స్వార్థప్రయో జనాల కోసం తెలంగాణ క్రికెట్ భవిష్యత్తును వీరు బలి చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు.

హైదరాబాద్ వెలుపల జరిగే క్రికె ట్ అభివృద్దికి సంబంధించి టీసీఏతో కలిసి పనిచేయాలని బాంబే హైకోర్టు ఆదేశించినా హెచ్‌సీఏ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఏకప క్షంగా జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కమిటీల్లో నియమితులైన పలువురి అర్హతలపై టీసీఏ తీవ్ర అభ్యంతరా లు వ్యక్తం చేసింది.

క్రిమినల్ కేసులు, అవినీతి ఆరోపణలున్న వ్యక్తులను కమిటీల్లోకి ఎంపిక చేసారంటూ విమర్శించింది. ఇదిలా ఉంటే టీజీ20 లీగ్‌లోనూ ఇదే తరహా నిర్ణయాలు తీసుకున్నారని టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి చెప్పారు. ఈ లీగ్‌లో కేవలం 10 శాతం మంది మాత్రమే జిల్లా క్రికెటర్లకు అవకాశం దక్కిందని, మిగిలినవారంతా హైదరాబాద్‌లో ఉన్న క్లబ్స్‌కు చెందినవారేనని ఆరోపించారు. తెలంగాణలోని నిజమైన క్రికెటర్లకు న్యాయం జరిగే వరకూ టీసీఏ పోరాటం కొనసాగుతుందని గురువారెడ్డి తెలిపారు.