14 July, 2026 | 8:52 AM

ఆస్తి కోసం తల్లిని.. కన్నబిడ్డలను కడతేర్చాడు

19-05-2024 01:11 AM

భూమి అమ్మాలని తల్లికి నిత్యం వేధింపులు

ఆమె ఆస్తిని మనువరాళ్ల పేరుపై బదలాయించడంతో హత్యకు పథకం

ఖమ్మం జిల్లా గోపాలపేటలో ఘటన

ఖమ్మం, మే 18 (విజయక్రాంతి): ఆస్తి కోసం ఓ ఉన్మాది దారుణానికి ఒడిగట్టాడు. జన్మనిచ్చిన తల్లితోపాటు కన్నబిడ్డలను పాశవికంగా కడతేర్చాడు. ఈ హృదయ విదారకమైన ఘటన శనివారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లుకు 11 ఏళ్ల క్రితం ఓ మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం నీరజ (10), ఝాన్సీ (6). రెండేళ్ల క్రితం భార్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అప్పటి నుంచి నీరజ, ఝాన్సీ ఆలన పాలనను వెంకటేశ్వర్లు తల్లి పిచ్చమ్మ(60) చూస్తున్నది.

వెంకటేశ్వర్లు పనిపాటా లేకుండా తిరుగుతూ తల్లిపేరుపై ఉన్న భూమిని అమ్మేయమని తల్లిని తరచూ ఒత్తిడి చేసేవాడు. దీంతో తల్లి గ్రామ పెద్దలను ఆశ్రయించింది. పెద్దల సూచన మేరకు ఆమె పిల్లలిద్దరి పేరుపై అర ఎకరా భూమితోపాటు ఇంటి స్థలాన్ని రాయించింది. వెంకటేశ్వర్లు కొద్దిరోజుల నుంచి తిరిగి భూమిని అమ్మి తనకు డబ్బు ఇవ్వాలని తల్లిని వేధించడం ప్రారంభించాడు. ఈ విషయంపై గ్రామపెద్దలు వెంకటేశ్వర్లును మందలించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఈ క్రమంలో తన తల్లి, పిల్లలిద్దరు చనిపోతే ఆస్తి తన పేరుపై మారుతుందని భావించి, వారిని కడతేర్చేందుకు పథకం పన్నాడు.

శుక్రవారం అర్ధరాత్రి పిచ్చమ్మ, నీరజ, ఝాన్సీ ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కొక్కరి మెడకు చున్నీచుట్టి చంపి అక్కడ నుంచి పరారయ్యాడు. ఉదయం స్థానికులు పిచ్చమ్మ, ఇద్దరు పిల్లలను విగతజీవులుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ రెహమాన్, సీఐ ఎన్.సాగర్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ముగ్గురు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు గతంలో ఓ మహిళతో సహజీవనం చేస్తూ అందుకు భార్య అడ్డుగా ఉందనిఆమెను హతమార్చాడనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.