21 July, 2026 | 11:08 AM

రంగారెడ్డిలో హెల్త్ వార్..!

21-07-2026 12:00 AM
  1. డీఎంహెచ్‌ఓ వర్సెస్ స్టాఫ్
  2. వివాదం వెనుక కుర్చీ లాటరీ?
  3.  కఠినత్వమా..? నిరంకుశత్వమా..? వైద్యశాఖలో ప్రకంపనలు
  4. మంత్రి, కలెక్టర్‌కు వేర్వేరుగా ఉద్యోగుల ఫిర్యాదు 
  5. ఎంట్రీ ఇచ్చిన  టీఎన్‌జీఓ నేతలు 
  6. నలిగిపోతున్న గ్రామీణ వైద్యసేవలు

రంగారెడ్డి, జూలై 20 (విజయక్రాంతి): రాష్ట్ర రాజధానిని ఆనుకుని ఉండే రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ప్రస్తు తం వివాదాలకు నిలయంగా మారింది. మూడు నెలలు క్రితం వికారాబాద్ నుంచి బదిలీపై వచ్చిన డీఎంహెచ్వో డాక్టర్ స్వర్ణకుమారి వైఖరిపై సిబ్బంది తిరుగుబావుటా ఎగురవేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

టీఎన్జీవో  ఆధ్వర్యంలో ఉద్యోగులు ఏకంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేసేవరకు వ్యవహారం వెళ్లింది. అయితే, పైకి కనిపిస్తున్న ‘అధికారిణి వేధింపులు  సిబ్బంది ఆవేదన’ వెనుక అసలు కథ వేరే ఉందా? లేదా కుర్చీని దక్కించుకునేందుకు జరుగుతున్న అంతర్గత రాజకీయా లా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అలవాటైన నిర్లక్ష్యమా? కఠినత్వానికి తట్టుకోలేకపోవడమా..?

గత కొంతకాలంగా జిల్లా వైద్యారోగ్య శాఖలో కొందరు సిబ్బంది క్షేత్రస్థాయి విధులను పక్కనబెట్టి సొంత ప్రయోజనాలకే ప్రా ధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొత్త డీఎంహెచ్వో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆకస్మిక తనిఖీలు వేగవంతం చేయడం, సమయపాలన పాటించని వారికి, విధుల్లో అలసత్వం వహించే వారికి మెమో లు ఇవ్వడం ప్రారంభించారు.

ఎన్నో ఏళ్లుగా విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న కొందరికి ఈ ‘కఠినత్వం’ మింగుడుపడటం లేదనే వాదన ఉం ది. విధుల్లో నిక్కచ్చిగా ఉండమని అడిగినందుకు అధికారిణిపై ‘నియంతృత్వ ముద్ర’ వే సి, ఉద్యోగ సంఘాలను ముందుపెట్టి ఒత్తిడి పెంచే వ్యూహం పన్నారనే టాక్ నడుస్తోంది.

మాటతీరే ముంచిందా?

అదే సమయంలో డీఎంహెచ్వో ప్రవర్తనా శైలిపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధుల్లో కఠినంగా ఉండటం వేరు, సాటి అధికారులను, కిందిస్థాయి సిబ్బందిని ‘నోర్మూసుకో‘, ‘గెట్ అవుట్‘ అంటూ చులకనగా మాట్లాడటం వేరు అని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి ఛాంబర్ ముందు నిలబెట్టడం, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సులతో సంబంధం లేకుండా ఏకపక్షంగా అంతర్గత బదిలీలు చేయడం (ఉదాహరణకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మ ల్రెడ్డి రంగారెడ్డి అసంతృప్తి) ఆమె సొంతంగా కొనితెచ్చుకున్న చిక్కులుగా మారాయి.

‘బంగారు బాతు’ లాంటి కుర్చీపై కొందరి కన్ను..

హైదరాబాద్‌కు సమీపంలో ఉండే రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో పోస్టు సాధా రణమైనది కాదు. ప్రైవేటు ఆసుపత్రుల అనుమతులు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం అమలు, నిధుల కేటాయింపు, అంతర్గత బదిలీల విషయంలో ఇది అత్యంత కీలకమైన పోస్టింగ్. పరిపాలనాపరంగా ఇది ఒక ’బంగారు బాతు’ లాంటిది కావడంతో, కొత్త డీఎంహెచ్వోను ఇక్కడ నిలదొక్కుకోకుండా చేసి ఆ స్థానాన్ని దక్కించుకోవడానికి జిల్లాలోని కొందరు సీనియర్ వైద్యాధికారులు, రాజధానిలోని లాబీలు వెనుకుండి చక్రం తిప్పుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.

రాజకీయ చదరంగంలో నలిగిపోతున్న రోగులు..

ఈ ముక్కోణపు పోరులో పోస్టింగ్ ఆశించే సీనియర్ అధికారులు, తమ మాట వినని అధికారిణిపై చెక్ పెట్టాలని చూస్తున్న రాజకీయ నాయకులు, పట్టు నిలుపుకోవాలని చూస్తున్న సంఘాల నేతలు తమ స్వార్థం కోసం వివాదాన్ని వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఒకరి నిరంకుశత్వం, మరొకరి నిర్లక్ష్యం, ఇంకొకరి కుర్చీ లాటరీ మధ్య జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ వైద్య సేవలు పడకేస్తున్నాయి. వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, కలెక్టర్ నారాయణరెడ్డి తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించి, ఇందులో అసలు ‘సూత్రధారులు’ ఎవరో, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ‘పాత్రధారులు’ ఎవరో తేల్చి ప్రజా వైద్యానికి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.