26 March, 2026 | 2:52 AM

ఉచిత వైద్య పరీక్షలతో విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ

26-03-2026 12:42 AM

కేజీబీవీనీ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

వెల్దుర్తి, మార్చి 25 : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా సందర్శించి పాఠశాల నిర్వహణను పరిశీలించారు. మెస్, అల్పాహారం నాణ్యతను తనిఖీ చేసి శుచిరుచికరమైన ఆహారం అందుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధన, వసతులు, సమస్యలపై ఆరా తీశారు.

ఆహార సరుకుల నాణ్యతను పరిశీలించి మెరుగైన ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి సూచించారు. పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా 99 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఆర్బీఎస్కే హెల్త్ క్యాంప్ ద్వారా బాలికల ఆరోగ్యంపై అవగాహనతో పాటు గైనకాలజీ సమస్యలకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

డి.సి.హెచ్‌ఎస్ శివదయాల్ ప్రకారం ఇప్పటివరకు 216 మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి, పౌష్టికాహార లోపం, ఐరన్, విటమిన్, థైరాయిడ్, కంటి మరియు నెలసరి సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.