26 March, 2026 | 2:31 AM

జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించాలి

26-03-2026 12:43 AM
  1. పార్లమెంటులో చర్చించాలి
  2. కేంద్ర మంత్రులను కలిసి విన్నవించిన బీసీ సంఘాల నేతలు

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): జనగణలో బీసీ కుటుంబాలను లెక్కించాలని, పార్లమెంటులో చర్చించి కేం ద్రం విధాన ప్రకటన చేయాలని బీసీ సంఘాల నేతలు కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసానీ చంద్రశేఖర్‌లను జాజుల శ్రీనివాస్‌గౌడ్, కేసన శంకర్‌రావుల బృందం కలిసి బీసీ డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించి, వినతిపత్రాలను అందజేశారు.

ఏప్రిల్ ఒకటి నుంచి జరిగే జాతి జనగణలో బీసీ కుటుంబాలను లెక్కించాలిలని, బీసీ కులగణనపై పార్లమెంటులో చర్చ పెట్టి కేంద్ర ప్రభుత్వం విధాన ప్రకటన చేయాలని, రాష్ట్రాన్ని యూనిటీగా తీసుకొని కులగణన మొదలుపెట్టాలని కోరారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోట పెట్టాలని విన్నవించారు. దేశ వ్యాప్తంగా రిజర్వేషన్లపై విధించిన 50% పరిమితిని ఎత్తివేయాలన్నారు.

సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్ నాయు డు, పెమ్మసానీ చంద్రశేఖర్.. బీసీ కులగణనకు కేంద్రం కట్టుబడి ఉన్నదని చెప్పారు. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. బీసీ కుటుంబాలను లెక్కించాలన్న డిమాండ్‌ను ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.