06-02-2026 01:45:05 PM
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను సుప్రీం కోర్టు(Supreme Court) మూడు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున మరికొంత సమయం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీంతో కోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటిస్తారని, గత ఆదేశాలకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు సుప్రీం తెలిపింది. లేనిపక్షంలో అప్పుడే ధిక్కారణ చర్యలపై ఆలోచిస్తామని వెల్లడించింది.
గత విచారణ తర్వాత జరిగిన పరిణామాలను న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయవాది సింఘ్వీ కోర్టుకు తెలిపారు. 2 కేసుల్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ న్యాయవాది మోహిత్ రావు వెల్లడించారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలపై విచారించడానికి ఏమీ లేదని మోహిత్ రావు తెలిపారు. ఒకరు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ తరుఫున ఎంపీగా పోటీ చేశారని, మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూతురు కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారని మోహిత్ రావు కోర్టుకు సూచించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ కు ప్రచారం చేశారని వివరించారు. ఇప్పుడు అందరూ బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు చెపుతున్నారని మోహిత్ రావు పేర్కొన్నారు.