13 July, 2026 | 2:18 AM

విప్లవ సాంస్కృతిక ధృవతార నాగన్న

13-07-2026 01:18 AM

మహబూబాబాద్, జులై 12 (విజయక్రాంతి): అరుణోదయ నాగన్న ఒక పేరు మాత్రమే కాదని, తెలుగు నేల నలుమూలల రెండు తరాల ఉద్యమాభిమానులను, ప్రజలను ఉర్రూతలూగించిన చైతన్య స్వరమని ప్రజా కవి యోచన, సిపిఐ ఎమ్మెల్ (న్యూడెమోక్రసీ ) రాష్ట్ర నాయకులు గోవర్దన్ అన్నారు.

మహబూబాబాద్ ముదిరాజ్ సంఘం భవన్ లో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అధ్యక్షతన జరిగిన సభలో వారు ప్రసంగిస్తూ ఎమర్జెన్సీ చీకట్లను చీల్చుకుంటూ  సైరన్ మోతై గర్జించిన ధిక్కార గళం నాగన్నదని, విప్లవోద్యమ పాటలు పద్యాలు, బుర్రకథ, ఒగ్గు కథ, అది ఏ కళారూపమైనా నాగన్న నోట రక్తి కట్టిందన్నారు. ఆయన తిరగని ఊరు లేదని, పాడని పాట లేదని, 50 ఏళ్ల తన విప్లవ సాంస్కృతిక ప్రస్థానంలో ఘనమైన చరిత్రని సృష్టించుకున్నాడన్నారు.

నాగన్న పీడిత ప్రజల జీవితాలపై అనేక పాటలు రాశాడని, దోపిడీ వర్గంపై జీవితాంతం పోరాడిన సాంస్కృతిక యోధుడని వారన్నారు. మనువాద ఫాసిస్టు సంస్కృతి వామపక్ష, లౌకిక, ప్రజాస్వామిక శక్తులపై అణిచివేత కొనసాగిస్తున్నదని అన్నారు. ఫాసిస్టు శక్తులు పెట్రేగి పోతున్నాయని, హంతక దాడులు, పాశవిక నిర్బంధంతో ప్రజల గొంతు నొక్కుతున్నారని దీనిపై కలం, గలం విప్పాల్సిన బాధ్యత కవులు కళాకారులపై ఉన్నదని అన్నారు.

నాగన్న 50 ఏళ్ల ఉద్యమ కళా జీవితంలో సామ్రాజ్యవాద దోపిడీ సంస్కృతిని చీల్చి చెండాడని, ఆయన మార్గంలో పయనించటమే కవుల, కళాకారుల ప్రధాన కర్తవ్యంగా ఉండాలని అన్నారు. నాగన్న వారసత్వాన్ని స్వీకరించి కవులు, కళాకారుల శ్రామిక ప్రజల తరఫున నిలబడాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాకవి, వాగ్గేయకారుడు కొమిరె సాకి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా అధ్యక్షులు ఇడంపాక శ్రీశైలం, అరుణోదయ జిల్లా కార్యదర్శి చారి హరీష్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు, మోకాళ్ళ మురళీకృష్ణ, హలావత్ లింగ్యా, జడ సత్యనారాయణ, గుగులోత్ సక్రు,ఊడుగుల లింగయ్య, పి వై ఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సామా పాపయ్య ,బట్టు చైతన్య పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు మునగాల మహేష్, జిల్లా కార్యదర్శి బోనగిరి మధు, ఐ ఎఫ్ టు యు జిల్లా అధ్యక్షుడు పర్వత కోటేష్, ఏఐకేఎంఎస్, జిల్లా గౌరవాధ్యక్షుడు బూర్క వెంకటయ్య, టి పి టి ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి మైసా శ్రీనివాస్ పాల్గొన్నారు.