1 June, 2026 | 1:49 AM

డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఆత్మీయ వీడ్కోలు

01-06-2026 12:15 AM

మణుగూరు, మే 31,(విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీతగా, ప్రభుత్వా డిగ్రీ  కళాశాల ప్రిన్సిపాల్గా సేవలందించిన  దొడ్డి భద్రయ్య పదవీ విరమణ  కార్యక్రమం ఆదివారం భావోద్వేగభరిత వాతావరణం లో జరిగింది. విద్యారంగంలో 37 సంవత్సరాల పాటు వివిధ హోదాలలో సేవలం దించిన ఆయనకు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు భావోద్వేగ వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  ముఖ్య అతిథిగా హాజరై భద్రయ్యను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రిన్సిపాల్ గా భద్రయ్య డిగ్రీ కళాశాల  అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. విద్యార్థుల  విద్యాప్రమాణాలను మెరుగుపరచడంలో ఆయన తీసుకున్న చర్యలు కళాశాలకు మంచి పేరు తీసుకు వచ్చాయన్నారు.

ముఖ్యంగా పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు  నాణ్యమైన విద్య అందించడంలో ఆయన చూపిన నిబద్ధత ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం తన అనుభవాన్ని సమాజ సేవకు వినియోగించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ భద్రయ్య  మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలో పనిచేసిన కాలం తన జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచిందన్నారు.

తోటి  అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అందించిన సహకారం వల్లే కళాశాల అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. తన సేవాకాలంలో అందరి సహకారం లభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం అధ్యాపకులు భద్రయ్యకు  ఆగమయ్యను శాలువా, పుష్పగుచ్ఛం, జ్ఞాపికతో సన్మానించి కృతజ్ఞతలు తెలి పారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యా పకులు,సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ప్రిన్సిపాల్  సేవలను కొనియాడారు. కార్యక్రమం చివరలో ఆయనకు వీడ్కోలు పలికి భావోద్వేగానికి లోనయ్యారు.