వడ్లు కొనమని అడిగితే కేసులు పెట్టిస్తారా..?
మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
చొప్పదండి, మే 31 (విజయ క్రాంతి): రైతులు తమ ధాన్యం కొనుగోలు ఎప్పుడు చేస్తారని ప్రశ్నించినందుకే వారిపై కేసులు నమోదు చేయడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగాధర ఎస్‌ఐ వంశీకృష్ణతో జరిగిన సంభాషణలో రైతులపై నమోదైన కేసుల విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వడ్లు కొనుగోలు చేయాలని అడిగిన రైతులను నేరస్థులుగా చూడటం సరైంది కాదన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సమక్షంలోనే సీపీతో మాట్లాడినట్లు సుంకే రవిశంకర్ తెలిపారు.
రైతులపై నమోదైన కేసుల విషయంలో స్పందించిన సీపీ, పూర్తి స్థాయిలో విచారణ జరిపి రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని, రిమాండ్ వరకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. రైతులు కలెక్టర్, సీపీ, ఎమ్మెల్యే సమక్షంలో ధాన్యం కొనుగోలు ఎప్పుడు జరుగుతుందని అడిగినందుకే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.
రైతులు ఇచ్చిన ఫిర్యాదులపైనా సమానంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, చట్టం అందరికీ ఒకే విధంగా ఉండాలని కోరారు. ‘వడ్లు కొనమని అడిగితే కేసులు పెడతారా? రైతులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలి. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం సరికాదు. కబర్దార్ మేడిపల్లి సత్యం‘ అంటూ సుంకే రవిశంకర్ హెచ్చరించారు.






