జడ్పీ సర్వసభ్య సమావేశం.. గరం గరం
నాగర్‌కర్నూల్, మే 25 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హా ల్‌లో శనివారం జడ్పీ చైర్‌పర్సన్ శాంతకుమారి అధ్యక్షతన నిర్వహించిన జడ్పీ సర్వ సభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. గైర్హాజరైన సభ్యులు, ప్రజాసమస్యలపై జిల్లా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. మునుపటి సమావేశంలో సభ్యులు మొత్తం 39 అంశాలపై ప్రశ్నలు సంధిస్తే, వాటి పరిష్కారంపై యంత్రాంగం నిర్లక్ష్యంగా సమా ధానం చెప్పడంపై సభ్యులు జడ్పీ సీఈవో దేవసహాయాన్ని నిలదీశారు.
ఐదేళ్లలో జడ్పీ ద్వారా ప్రజలకు జరిగినే మేలు శూన్యమని ఎంపీ రాములు మండిపడ్డారు. జడ్పీటీసీలు సొంతంగా జడ్పీ అధ్యక్షుడిని ఎన్నుకోలేని దౌర్భాగ్యస్థితి నెలకొనడం బాధాకరమన్నా రు. తాను బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మనసు చంపుకుని సమావేశాలకు హాజరయ్యానని ప్రస్తావించారు. కొత్త ప్రభుత్వం లోనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. జవాబుదారీ తనంతో పనిచేసి ప్రజలకు మేలు చేయాలన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో 22 మందిని నిబందనలకు విరుద్ధంగా నియమించారని, వెంటనే వారి పోస్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు.






