24 గంటలు.. చీకట్లోనే చందానగర్
వర్షం కారణంగా నిలిచిపోయిన విద్యుత్
పునరుద్ధరించని అధికారులు
చందానగర్ సబ్ స్టేషన్ ఎదుట స్థానికుల నిరసన
సబ్ స్టేషన్ గేట్లను తాడుతో బిగించిన వైనం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8 (విజయక్రాంతి) : నగరంలో రెప్పపాటు కూడా కరెంటు పోదు. ఇది మొన్నటి మాట. పోయిన కరెంట్ 24 గంట లు దాటినా రాదు. ఇది నేటి మాట. అవును నగరంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడి 24గంటలు దాటింది. చెట్ల కొమ్మలు విరిగిపడి నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే కరెంట్ అధికారులు మత్తు వీడని కారణంగా గడిచిన 24 గంటలుగా కొన్ని ప్రాంతాలు చీకట్లోనే ఉన్నాయి. మంగళవారం సాయంత్రం పోయిన విద్యుత్ బుధవారం సాయంత్రం వరకు రాలేదు. ముఖ్యంగా చందానగర్ ప్రాంతం 24గంటలుగా చీకట్లోనే ఉంది. విద్యుత్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు రోడ్డెక్కారు. చందానగర్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేయడంతో పాటు విద్యుత్ అధికారులు బయటకు రాకుండా ఉండేందుకు రెండు గేట్లకు తాడు కట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఆ స్థాయిలో నిరసన తెలిపినా ఆ ప్రాంతంలో విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. కానీ విద్యుత్ అధికారులు మాత్రం బుధవారం మధ్యాహ్నమే విద్యుత్ పునరుద్ధరణ చేశామని చెప్పడం కొసమెరుపు.
విరిగిన చెట్లు.. తెగిపడిన తీగలు
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగర వ్యాప్తంగా చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై, స్తంభాలపై ఒరిగి పడ్డాయి. దీంతో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు సైతం నేలకు ఒరిగాయి. ఫలితంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. వాస్తవానికి జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందాలు, విద్యుత్ సిబ్బంది చెట్ల కొమ్మలు తొలగించి చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. కానీ, శేరిలింగంపల్లి, చందానగర్ ప్రాంతాల్లో చాలా చోట్ల 24గంటలు దాటినా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో పాటు చందానగర్ ఏఈ సుమన్, డిఈ రవీందర్‌ల ఫోన్లు స్వీఛ్ ఆఫ్ అయినట్టుగా స్థానికులు తెలిపారు. వేమన కాలనీ, బంధం కొమ్మ, దీప్తిశ్రీ నగర్, హుడాకాలనీ, రామకృష్ణనగర్, శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీలో కరెంటు లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సైతం పాల్గొని విద్యుత్ సరఫరాకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. చందానగర్‌తో పాటు గ్రేటర్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, ఖైరతాబాద్, ఉప్పల్, బోడుప్పల్, ఎల్‌బీ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు మంగళవారం రాత్రి మొత్తం చీకట్లోనే ఉన్నారు. అయితే గతంలో ఇంతకంటే రెండింతల అదనపు వర్షం పడినా.. విద్యుత్ పునరుద్ధరణకు 24గంటల సమయం దాటిన దాఖలాలు లేవు. ప్రసుత్తం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నగరంలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
ప్రతి ఫిర్యాదును పరిష్కరించాం - ఆనంద్, ఆర్‌ఆర్ జోన్ సీజీఎం
మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచింది. ఈ విషయంలో తెల్లవార్లు నిద్రపోకుండా అధికారులు, సిబ్బంది పనిచేశారు. వాస్తవానికి మధ్యాహ్ననికే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. విద్యుత్ సరఫరాకు జరిగిన అంతరాయంలో రెండ్రోజులు పట్టే పనిని ఒక్కపూటలోనే పూర్తి చేశాము. ప్రజలు ఫిర్యాదు చేయడానికి వచ్చినా కూడా అది ధర్నా అంటే ఎలా..? ముఖ్యంగా చందానగర్ సబ్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 ఫీడర్లు ఉన్నాయి. ఈ 12 ఫీడర్లు ఎలాంటి సమస్యలు లేకుండా సరఫరా నడుస్తోంది.






