18 April, 2026 | 2:24 PM

కారు దిగి హస్తం పార్టీలో చేరికలు

09-05-2024 02:10 AM

రాజేంద్రనగర్, మే 8 : ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సంతృప్తిగా ఉన్నారని శంషాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు శ్రీకాంత్‌యాదవ్, శ్రీకాంత్‌రెడ్డి, తాజ్ బాబా, శ్రీకాంత్‌యాదవ్, భద్రునాయక్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని వ్యాఖ్యానించారు. బుధవారం శంషాబాద్ మున్సిపాలిటికి చెందిన ఐదుగురు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కారు దిగి హస్తం గూటికి చేరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో ఇచ్చిన హామీలపై దృష్టి కేంద్రీకరించారన్నారు. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వీరితో పాటు 250మంది బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. 

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.  బుధవారం అమీన్‌పూర్ మండల యూత్  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్ ఆధ్వర్యంలో సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా దాసరి సంఘం అధ్యక్షుడు, సుల్తాన్‌పూర్ ఉపసర్పంచ్ దాసరిగోపాల్ తన అనుచరులు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాట శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వీరికి పార్టీ కండువాలు వేసి కాంగ్రెస్‌లోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అందరిని ఆకర్షిస్తుందన్నారు. పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.