calender_icon.png 23 February, 2026 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణాదిలో నేడు భారీ వర్షాలు

23-02-2026 01:31:41 AM

  1. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో వాన అవకాశాలు చాలా తక్కువ

హైదరాబాద్, ఫిబ్రవరి 22(విజయక్రాంతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు దక్షిణాదిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అల్పపీడన ప్రభావంతో దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో దట్టమైన మే ఘాలు కమ్ముకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కేవలం తేలికపాటి మేఘాలు మాత్రమే కనిపిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులోనే ఎండలు ముదురుతు న్నాయి.

రానున్న ఏడు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీ, హరియాణా రాష్ట్రాల్లో వారాంతానికి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు చేరుకోవచ్చు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 37 డిగ్రీల వరకు ఎండలు కాసే అవకాశం ఉంది. పగటిపూట ఆకాశం నిర్మలంగా ఉండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే పంజాబ్, హరియాణా వంటి ప్రాంతాల్లో ఉదయం వేళల్లో పొగమంచు కనిపిస్తోంది.

తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో మాత్రం స్వల్పంగా చలి గాలులు వీస్తున్నాయి. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్కైమెట్ వెదర్ పేర్కొంది. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.