14 March, 2026 | 9:34 PM

ముంచెత్తిన భారీ వర్షం.. హైదరాబాద్‌ కకావికలం

18-09-2025 09:13 AM

హైదాబాద్: మరోసారి భాగ్యనగరాన్ని భారీ వానలు(Heavy Rains) ముంచెత్తాయి. రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్(Hyderabad Rains) లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుధవారం రాత్రి పడిన వర్షానికి నగరవాసులు బెంబేలెత్తి పోయారు. పలు ప్రాంతాల్లో రూడ్లపై మోకాలి లోతులో వరదనీరు ప్రవహించింది. భారీ వర్షాలకు రోడ్లు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవాహానికి పలువురు కొట్టుకుపోగా, వారిని స్థానికులు కాపాడారు. నాలాల్లో భారీగా వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వదరనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు రూడ్లపై ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తాయి. రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనాదారులు గంటలకొద్దీ రోడ్లపైనే నిరీక్షించారు.

వర్షం ధాటికి చాలా ప్రాంతాల్లో బైకులు కొట్టుకుపోయాయి. సికింద్రాబాద్ పరిధి సీతాఫల్ మండిలో ఆటోపై గోడ కూలింది. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నాయి. ఖైరాతాబాద్ ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్ లో కాలనీలు నీటమునిగాయి.నీటి నిల్వతో కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లోని పలు చోట్లు అర్ధరాత్రి వరకు భారీ వర్షం పడింది. రాత్రి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం ముంచెత్తింది. ముషీరాబాద్ తాళ్ల బస్తీలో 18.4 సెం.మీ, ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీలో 15.6 సెం.మీ, భోలక్ పూర్ కమ్యూనిటీ హాల్ లో 15.5 సెం.మీ, చిలకలగూడలో 14.7 సెం.మీ, మోండా మార్కెట్ లో 14.6 సెం.మీ, మారేడ్ పల్లి న్యూ మెట్టుగూడ ప్రాంతంలో 14 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు గురువారం వెల్లడించారు.