29-07-2024 12:49:20 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): నగరంలో వాహనదారుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా, స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి చర్యలు తీసుకుంటున్నా కొందరు వాహనదారుల్లో మార్పు రావడం లేదు. కేవలం 6 నెలల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన నగర వాసుల సంఖ్య అక్షరాలా 51,56,823. ట్రాఫిక్ పోలీసులు అధికారికంగా గుర్తించిన లెక్క ఇది.
సీసీ కెమెరాలకు చిక్కని వారు అంతకు మించే ఉంటారని అంచనా. ము ఖ్యంగా సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ రోడ్లపై వాహనాలను అడ్డదిడ్డంగా నడపడం వంటి చర్యలతో అనేక మంది వాహనదారులు ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్నారు. గతేడాది మొదటి ఆరు నెలల్లో 57,05,413 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 51,56,823 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.
వీటిలో ట్రాఫిక్ పోలీసులు నేరుగా తనిఖీలు చేసి చలానాలు విధించినవి 12,26,031 కాగా కెమెరాలకు చిక్కిన ట్రాఫిక్ ఉల్లంఘనదారులు 36,77,436, నో పార్కింగ్‌లో వాహనాలు నిలిపిన వారికి చలాన్లు విధించిన కేసులు 12,5445, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారం నిర్వహించే వారిపై విధించిన చలానాలు 76,698గా ఉన్నాయి. హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారిపై 34,506 కేసులు నమోదయ్యాయి. కొంతమంది ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్‌తో ఇతర వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీరి కారణంగానే ఎక్కువగా ప్రమాదాలు జరుగు తున్నాయని ట్రాఫిక్ పోలీసులు భావి స్తున్నారు. అరు నెలల కాలంలో ఇలాంటి వారిపై 71,043 కేసులు నమోదయ్యాయి.
సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్..
పది మంది వాహనదారుల్లో కనీసం ముగ్గురు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఒక చేతిలో సెల్‌ఫోన్, మరొక చేతిలో స్టీరింగ్ పట్టుకొని కార్లు నడుపుతున్న దృశ్యాలు నగరంలో కోకొల్లలు. ద్విచక్ర వాహనదారులైతే చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకొని, లేదా హెల్మెట్ చాటున సెల్‌ఫోన్ పెట్టుకొని మాట లు మాట్లాడుతూ, పాటలు వింటూ ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్నారు. ఇలాంటి వారిపై జనవరి నుంచి జూన్ వరకు 67,488 కేసులు నమోదయ్యాయి.
డ్రంకెన్ డ్రైవ్‌లో..
రాత్రయిందంటే చాలు పీకల దాకా మద్యం తాగి నగర రోడ్లపై హంగామా సృష్టిస్తున్నారు మందుబాబులు. పోలీసులు ఎన్ని తనిఖీలు చేపట్టినా, జరిమానాలు విధించినా వారిలో మార్పు రావడం లేదు. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు 51,213 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
మైనర్ డ్రైవింగ్..
ఈ మధ్య కాలంలో మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. పోలీసులు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ నిర్వహించిన వారిలో మార్పు రావడం లేదు. రు నెలల కాలంలో 1,261 కేసులు నమోదయ్యాయి.
నంబర్ ప్లేట్ లేని వాహనాలు..
ట్రాఫిక్ చలానాలు తప్పించుకోవడానికి చాలామంది నంబర్ ప్లేట్ పెట్టుకోకుండా వాహనాలను నడుపుతున్నారు. మరికొంత మంది వాహనాలకు ఉన్న నంబర్ ప్లేట్‌లు ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కకుండా వాటిని వంచడం, నంబర్లు కనబడకుండా చేయడం వంటివి చేస్తున్నారు. ఇలా నంబర్ ప్లేట్‌లు లేకుండా వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఆరు నెలల్లో 71,043 కేసులు నమోదు చేశారు.
వాహనదారులు రోడ్లపై క్రమశిక్షణతో మెదగాలి
నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ప్రజలు, వాహనదారులు క్రమశిక్షణతో మెదగాలి. కొందరు వాహనదారుల అత్యుత్సాహం, గమ్యస్థానానికి చేరుకోవాలనే తొందర మిగతా వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుంటాయి. దీని వలన రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలో ఆటోమెటిక్ సిస్టంను ఆధునీకరిస్తాం. ప్రజల సహకారంతోనే సిటీలో ట్రాఫిక్ సమస్యను అధిగమించగలం.
రాహుల్ హెగ్డే, ట్రాఫిక్ డీసీపీ