11 April, 2026 | 3:08 AM

కెమికల్ వాసన కంపు..!

11-04-2026 01:06 AM

కాలనీల్లో నరకం మురుగు కాల్వల్లో పారుతున్న విషం 

అధికారుల నిర్లక్ష్యంపై ‘జేఏసీ’ గర్జన

నాగోల్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): నగరం నడిబొడ్డున ఉన్న ఆ కాలనీల ప్రజలకు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం ఒక కలగా మారింది. వరదనీరు పారాల్సిన కాల్వల్లో రంగురంగుల కెమికల్ వ్యర్థాలు ప్రవహిస్తుంటే.. ఆ కాలనీలన్నీ గ్యాస్ చాంబర్లను తలపిస్తున్నాయి. అధికారుల అలస త్వం, పారిశ్రామికవేత్తల స్వార్థం వెరసి సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.

విషవలయంలో ప్రధాన కాలనీలు

మన్సూరాబాద్ డివిజన్లోని సుమారు పదికి పైగా కాలనీలు ఇప్పుడు రసాయన ముప్పును ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా సెవెన్ హిల్స్ కాలనీ, స్వాతి రెసిడెన్సి,ద్వారకానగర్, డీపీనగర్, హిమపురి కాలనీ,సౌత్ ఎండ్ పార్క్, జడ్జెస్ కాలనీ,చండీశ్వర్ కాలనీ, ప్రెస్ కాలనీ ఈ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడమే కాకుండా, కాలువల నుంచి వెలువడుతున్న తీవ్రమైన దుర్వాసనతో ప్రజలు ఇళ్లలో తలుపులు పెట్టుకుని ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.

అనారోగ్యాల అడ్డాగా కాలనీలు.....

ఈ రసాయన వ్యర్థాల ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తీవ్రంగా చూపిస్తోంది. చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. చర్మంపై దద్దుర్లు, కళ్ల మంటలు నిత్యకృత్యమయ్యాయి. కాల్వలకు స్లాబ్ (మూతలు) లేకపోవడంతో విష సర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయని, అటు ఆటోనగర్ డంపింగ్ యార్డ్ వాసన.. ఇటు కెమికల్ మురుగుతో బతుకు బస్టాండ్ అయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అర్ధరాత్రి దందా.. అధికారుల ‘మామూలు’ నిద్ర.....

ఈ వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై జేఏసీ అధ్యక్షుడు కత్తులు రాంబాబు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. ‘కొందరు స్వార్థపరులు రాత్రి సమయాల్లో భారీ ట్యాంకర్ల ద్వారా కెమికల్ వ్యర్థాలను తీసుకువచ్చి, ఆటోనగర్ పారిశ్రామిక ప్రాంతంలోని డ్రైనేజీ మ్యాన్హోల్స్లో గుట్టుచప్పుడు కాకుండా వదులుతున్నారు. ఇది తెలిసినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటి?‘ అని ఆయన ప్రశ్నించారు.

* జేఏసీ (JAC) పోరాటం....

సమస్య తీవ్రతను గుర్తించిన కాలనీ సంక్షేమ సంఘాలు ఏకమై జేఏసీ గా ఏర్పడ్డాయి. గత కొన్నేళ్లుగా జీహెచ్‌ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ఒక శాఖపై ఒకరు సాకులు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

నిఘా పెంచాలి..

రాత్రి వేళల్లో ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలు వదులుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.ఓపెన్ డ్రైనేజీలపై తక్షణమే స్లాబ్లు నిర్మించాలి. మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే వదిలేలా చర్యలు తీసుకోవాలి.రెవెన్యూ, మున్సిపల్, పొల్యూషన్ బోర్డు అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలి.

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కెమికల్ మాఫియాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే, రాబోయే రోజుల్లో ఈ కాలనీలు నివాసయోగ్యం కాకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి మన్సూరాబాద్ వాసులకు ఈ ‘నరకయాతన’ నుండి విముక్తి కలిగిస్తారో లేదో చూడాలి.

- కత్తులు రాంబాబు , జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు