17 May, 2026 | 1:49 AM

హలో బాసు.. డిలీటెడ్ సాంగ్!

17-05-2026 12:34 AM

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. భారతదేశపు తొలి మ్యూజికల్ ఫాంటసీగా రూపొందించబడిన చిత్రమిది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్‌అశ్విన్ నిర్మించిన ఈ సినిమాలో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రలు పోషించారు. జూన్ 11న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో శనివారం ఈ సినిమా నుంచి హలో బాసు సాంగ్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.

దేవిశ్రీప్రసాద్ స్వరపర్చడమే కాకుండా ఉత్తాన భారిఘాట్ కలిసి ఆయన రాసిన పాట ఇది. దీన్ని వంశీ, ఆర్‌పీ కృష్ణాంగ్ పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ నాగ్‌అశ్విన్  మాట్లాడుతూ.. “సింగ్ గీతం’ నుంచి ఒక డిలీటెడ్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నాం. ఈ సాంగ్ చాలా బాగుంటుంది. కాకపోతే సినిమాకు తీసేయమని చెప్పారు (నవ్వుతూ). సింగీతం ప్రతి సినిమాకీ కొత్తగా ఆలోచిస్తారు. ఇది ఆయన లాంగ్‌టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్. ‘జాతిరత్నాలు’ తర్వాత నేను నిర్మిస్తున్న సినిమా ఇది.

ఆ సినిమాను ఎలా నవ్వుతూ ఎంజాయ్ చేశారో, ఈ సినిమాను కూడా అలాగే ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా” అన్నారు. నటుడు వంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో దాసు అనే క్యారెక్టర్ చేశా. ఆ పాత్ర చాలా కొత్తగా, చాలా ఫన్‌గా ఉంటుంది. సింగీతం సినిమాలో అవకాశం రావడం జీవితంలో చాలా అరుదు” అని చెప్పారు.