20-01-2026 05:45:53 PM
ప్రాణ రక్షణకు కవచం హెల్మెట్
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రాణం అనేది చాలా విలువైనదని, ప్రాణ రక్షణకు కవచం హెల్మెట్ అని వాహన దారులు గుర్తించుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన హెల్మెట్ నమూనాను ప్రారంభించారు. కామారెడ్డిలో భారీ హెల్మెట్ అవగాహన సదస్సు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి సీతక్క మాట్లాడుతూ
ప్రాణం అనేది చాలా విలువైంది. ఒక్క క్షణం అజాగ్రత్త ఒక నిండు కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది. మన కోసం ఇంట్లో ఎదురుచూసే తల్లిదండ్రులు, భార్యాపిల్లల ముఖాలను గుర్తుచేసుకుని ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలన్నారు.హెల్మెట్ అనేది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదు, అది మీ ప్రాణానికి రక్షణ కవచం అని గుర్తుంచుకోవాలన్నారు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ... కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుండటం విచారకరం. తలకు దెబ్బ తగలడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, పౌరుల క్షేమమే మా మొదటి ప్రాధాన్యత అని అన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్‌ను భారంలా కాకుండా ఒక అలవాటుగా మార్చుకోవాలన్నారు.
పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారి భద్రతపై కఠిన నియమాలు అమలు చేస్తున్నాయన్నారు. వాటిని ప్రజలు స్వచ్ఛందంగా పాటించాలి. హెల్మెట్ అవగాహన కార్యక్రమాలు కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెల్లో కూడా విస్తృతం చేయాలి అన్నారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ... రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ప్రజలు పోలీసులకు సహకరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్, మాజీ డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టిపిసిసి కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు.