ఓటర్ల సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్
కీసర ఆర్డీఓ నల్ల వెంకట్‌రెడ్డి
మేడ్చల్, జూన్ 30 (విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం లో ఓటర్ల సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని కీసర ఆర్డీఓ, ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో) నల్ల వెంకట్రెడ్డి తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు, పేరు లేదా చిరునామా మార్పు, వివరాల్లో సవరణలు, అనర్హుల పేర్ల తొలగింపు, ఎన్యూమరేషన్ ఫారమ్ల నింపడం వంటి అంశాలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్డెస్క్ను సంప్రదించాలని కోరారు.అర్హులైన ప్రతి పౌరుడు నిర్ణీత గడువులోగా ఎన్యూమరేషన్ ఫారమ్ను పూర్తి చేసి సంబంధిత బూత్ స్థాయి అధికారి (బీఎల్‌ఓ)కి సమర్పించాలని సూచించారు.
సరైన వివరాలతో ఫారమ్ను సమర్పించడం ద్వారా ఓటరు జాబితాలో పేరు కొనసాగుతుందని, ఓటు హక్కును పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలని అన్నారు. ఓటర్లు తమ సందేహాల నివృత్తి కోసం కీసర ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ను నేరుగా సంప్రదించవచ్చని, లేదా 7675849846 నంబరుకు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని తెలిపారు. హెల్ప్డెస్క్ ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.






