జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు నివాళి
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహించి ఇటీవల కన్నుమూసిన జస్టిస్ ఎ రామలింగేశ్వర రావుకు ఫుల్ కోర్టు బుధవారం ఘన నివాళులర్పించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే అధ్యక్షతన బుధవారం ఫుల్ కోర్టు ప్రత్యేకంగా సమావేశమై జస్టిస్ రామలింగేశ్వర రావుకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసింది. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఆయన చేసిన సేవలను సమావేశంలో కొనియాడారు.
ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ఎ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజాప్రయోజనం, సామాజిక న్యాయానికి సంబంధించిన కేసు ల్లో రామలింగేశ్వరరావు కీలక తీర్పులకు కారణమయ్యారని తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ నరసింహారెడ్డి, ఏఎస్జీ నరసింహ శర్మ, డీఎస్జీ గాడి ప్రవీణ్ కుమార్, పీపీ నాగేశ్వర రావు, ఏఏజీలు ఇమ్రాన్ ఖాన్, తేరా రజనీకాంత్ రెడ్డితో పాటు ఇతర కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న జస్టిస్ రామలింగేశ్వర రావు జర్మనీలో కుమార్తెను చూసేందుకు వెళ్లి అక్కడే ఈ నెల 5న తుది శ్వాస విడిచారు.






