‘సంక్షేమ బోర్డు’ సమస్యలు తీర్చేనా?

25-04-2024 02:20:43 AM

సీఎం రేవంత్‌రెడ్డి హామీలపై గల్ఫ్ బాధితుల గంపెడు ఆశలు

పింఛను, బీమా, పిల్లలకు ఉచిత విద్య కావాలని డిమాండ్

కేరళ తరహా విధానాలను అమలు చేయాలని సంఘాల విన్నపం

రాష్ట్ర ప్రభుత్వం తమ ఆకాంక్షలు నెరవేరుస్తుందని ఎదురుచూపులు

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 24 (విజయక్రాం తి): దేశం కానీ దేశం.. ఊరు కానీ ఊరు.. అక్కడ ఎలా బతకాలో తెలియదు.. ఎవరు సాయం చేస్తరో తెలియదు.. బిక్కుబిక్కుమం టూ అక్కడి వెళితే పాస్‌పోర్టులు ఏజెంట్లు లాక్కోవడం..యజమానులు వారితో వెట్టిచాకిరీ చేయించడం మామూలే. అక్కడి చట్టాలపై అవగాహన లేక, క్షణికావేశంలో చిన్న చిన్న నేరాలకు పాల్పడి జైళ్లలో మగ్గుతున్న వారెందరో. ప్రమాదవశాత్తు అక్కడ ఏదైనా కారణంతో మరణిస్తే వారి మృతదేహాలు స్వదేశానికి తీసుకురావడమూ గగనమే. స్థానికంగా ఉపాధి దొరక్క, ఒకవేళ పని దొరికినా వచ్చే ఆదాయం సరిపోక తెలంగాణ నుంచి ఏటా వేలాది మంది గల్ఫ్ బాట పడుతున్నారు.ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఈ వలసలు ఎక్కువ. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పల్లెల్లో దాదాపు ప్రతి ఇంటికీ గల్ఫ్ దేశాలతో సంబంధాలు ఉంటాయంటే అతిశయోక్తికాదు. వారి కుటుంబ సభ్యుడో, బంధువో, సన్నిహితుడో గల్ఫ్‌లో ఉంటాడు.. ఇలా గ్రామస్తులకు గల్ఫ్ తో ఏదో ఒక సంబంధం ఉంటుంది. గల్ఫ్ బాధితుల సమస్యలను గతంలో ఏ ప్రభుత్వమూ వారి బాగోగులను పట్టించుకోలేదు. తాజాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల16న గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిపై ప్రస్తుతం గల్ఫ్ బాధితులు, సంఘా ల్లో విరివిగా చర్చ నడుస్తున్నది.

రూ.వెయ్యి కోట్ల ఆదాయం..

ఉత్తర తెలంగాణ నుంచి ఏటా పెద్ద ఎత్తు న కార్మికులు యూఏఈ, సౌదీ అరేబియా, ఓమన్, బెహ్రాన్, ఖతార్, కువైట్‌కు వలస వెళ్తారు. వీరిలో 80శాతం మంది యువకు లు. వీరంతా అక్కడికి వెళ్లి నైపుణ్యాలు అక్కర్లేని (అన్‌స్కిల్డ్) కూలి పనుల వంటివి చేసు కుంటూ జీవనం సాగిస్తారు. వీరు ఎక్కువగా హోటళ్లు, ప్యాకింగ్ పరిశ్రమల్లో పనిచేస్తారు. కాస్తంత ప్రతిభ ఉన్నవారు అక్కడి భాషను నేర్చుకుని, నైపుణ్యాలు (స్కిల్) పెంపొందించుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతారు. వారు ఆకర్షణీయమైన వేతనాలు, పారితోషికాలు అందుకుంటారు. ప్రస్తుతం మన రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు సుమారు 15 లక్షల మంది ఉంటారని ఓ అంచనా. వారు అక్కడి నుంచి ఇండియాకు పంపే సొమ్ములో జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.వెయ్యి కోట్ల పన్ను అందుతుందంటే ఏ మేరకు లావాదేవీలు జరుగు తాయో ఊహించవచ్చు.

ప్రయోజనాలు ఉండాలని ఆకాంక్ష..

కేరళలో గల్ఫ్ బాధితులకు అమలవుతున్న విధానాలు రాష్ట్రంలోనూ అమలైతే బాగుంటుందని కార్మిక సంఘాల సభ్యులు భావిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం బాధితులకు పింఛన్, బీమా సౌకర్యం ఉందని, జైళ్ల లో మగ్గుతున్న వారి కోసం సర్కార్ న్యాయపోరాటం చేస్తున్నదంటున్నారు. అలాగే గల్ఫ్‌లో మృతిచెందిన కార్మికుల మృతదేహాలను స్వదేహానికి తెప్పించడం, కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడం, మృతుల పిల్లలకు ఉచిత విద్య అందించే పథకాలు అమలవుతున్నాయని, ఇదే తరహా పథకాలను రాష్ట్రంలోనూ ఆశిస్తున్నామంటున్నారు. గల్ఫ్ వెళ్లే వాళ్లకి ప్రభుత్వం ముందు గానే నైపుణ్య శిక్షణ ఇచ్చి, రుణాలు అందిస్తే బాగుంటుందంటున్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తామని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చింది. సర్కార్ చిత్తశుద్ధితో బోర్డు ఏర్పాటు చేస్తే సమస్యలు కొలిక్కి వస్తాయని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

బాధితులకు ప్రభుత్వ సాయం..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి గల్ఫ్ బాధితుల సమస్యలపై దృష్టి సారించారు. వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. దీనిలో భాగం గా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గానికి చెందిన రెండు గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. మున్ముందు ఎంతోమంది బాధితులకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అండగా ప్రభుత్వం..

గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం గా ఉంది. ఇప్పటికే గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపింది. వారి సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకున్నది. దీని లో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించా రు. మేము అధికారంలోకి రాగానే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు గల్ఫ్ బాధితులకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాం. 

 ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్