హుస్నాబాద్ రోడ్డు విస్తరణకు హైకోర్టు వరుస బ్రేకులు
- రెండు వేర్వేరు రిట్ పిటిషన్లలో బాధితులకు ‘స్టేటస్ కో’ రక్షణ
- చట్ట ప్రక్రియ, నష్టపరిహారం లేకుండా ఆస్తులపై చర్యలు వద్దని హైకోర్టు స్పష్టం
హుస్నాబాద్, జూలై 27(విజయక్రాంతి): హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా వద్ద ప్రతిపాదిత 80 అడుగుల రహదారి విస్తరణ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు వరుసగా రెండోసారి కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రహదారి విస్తరణ పేరుతో చట్టబద్ధమైన ప్రక్రియ పాటించకుండా ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, కూల్చివేతలు చేపట్టడం, నష్టపరిహారం చెల్లించకుండా చర్యలకు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తూ పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.
పూర్వాపరాలను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు, ఈ రహదారి విస్తరణకు సంబంధించి దాఖలైన రెండు వేర్వేరు రిట్ పిటిషన్లలో బాధితులకు మధ్యంతర రక్షణ కల్పించింది.మొదటగా, ప్రధాన పిటిషనర్ కొండూరి రవీందర్ దాఖలు చేసిన రిట్ పిటిష్ప జూలై 24, 2026న విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి, పిటిషనర్కు చెందిన హౌస్ నంబర్లు 9-56, 9-57లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
తదుపరి విచారణ వరకు ఆస్తిపై ఎలాంటి జోక్యం చేసుకోవద్దని అధికారులను ఆదేశించారు.అదే రహదారి విస్తరణలో ప్రభావితులైన గాజుల రమేష్, ఆయన సతీమణి గాజుల వాసవి, జక్కని ఆనంద్, పచ్చిమట్ల అనిల్ దాఖలు చేసిన మరో రిట్ పిటిషన్లో కూడా హైకోర్టు జూలై 27, 2026న విచారణ జరిపి, వీరి ఆస్తులకు సంబంధించి కూడా స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒకే రహదారి విస్తరణ అంశంపై వరుసగా రెండు వేర్వేరు పిటిషన్లలో హైకోర్టు బాధితులకు తాత్కాలిక రక్షణ కల్పించినట్లైంది.
పిటిషనర్ల వాదన ప్రకారం, అధికారులు 2026 జూన్ 17న సమర్పించిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, చట్టబద్ధమైన విచారణ నిర్వహించకుండా, తగిన నష్టపరిహారం చెల్లించకుండా ఆస్తులపై చర్యలకు సిద్ధమవుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ చర్యలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్14 మరియు ఆర్టికల్300-ఏలో కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పిటిషన్లలో పేర్కొన్నారు.
పిటిషనర్ల తరఫున హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన న్యాయవాది రవికుమార్ వొద్యారపు సమగ్ర వాదనలు వినిపించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది, హుస్నాబాద్ మున్సిపాలిటీ తరఫున స్టాండింగ్ కౌన్సెల్ పుట్ట కృష్ణారెడ్డి హాజరై పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు, తదుపరి విచారణ వరకు బాధితుల ఆస్తులపై కూల్చివేతలు, స్వాధీనం లేదా ఇతర జోక్య చర్యలు చేపట్టరాదని స్పష్టం చేస్తూ స్టేటస్ కో (యథాతథ స్థితి) కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసుల తదుపరి విచారణను 2026 ఆగస్టు 7కు వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.హుస్నాబాద్లో ప్రతిపాదిత 80 అడుగుల రహదారి విస్తరణ వ్యవహారంలో వరుసగా రెండు పిటిషన్లలో హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడం, చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించడం, న్యాయమైన నష్టపరిహారం చెల్లించడం వంటి అంశాలను విస్మరించి అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరించరాదనే స్పష్టమైన సందేశాన్ని ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కేసులపై ఆగస్టు 7న జరిగే తదుపరి విచారణలో మరిన్ని కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.






