ఆధార్ ప్రింట్‌పై అధిక రుసుములు
మీసేవ సిబ్బందిపై ప్రజల్లో ఆగ్రహం
కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో నిర్వహించే మీసేవ కేంద్రాలు ప్రజలకు సులభంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాలు కొంతమంది సిబ్బంది లాభాపేక్షకు వేదికలుగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆధార్ ప్రింట్ సేవల విషయంలో పలు కేంద్రాల్లో సిబ్బంది నిర్దిష్ట రుసుము కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ప్రజలు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు ప్రింట్ సేవకు రూ.10 మాత్రమే చెల్లించాలి.
కానీ కొత్తకోట, అమడబాకుల, గోపాలపల్లి, ప్యూపిల్స్ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని మీసేవ కేంద్రాల్లో రూ.20 నుండి రూ.50 వరకు వసూలు చేస్తున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలు ఈ వ్యత్యాసం ఎందుకు వస్తోందో అడిగితే, “సర్వర్ స్లోగా ఉంది”, “ప్రింటర్ ఖర్చు ఎక్కువ”, “సిస్టం మెయింటెనెన్స్ ఫీజు” వంటి కారణాలు చూపుతున్నారని స్థానికులు తెలిపారు. దాంతో ప్రజలు అయోమయంలో పడి, బలవంతంగా అధిక రుసుము చెల్లించాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. ఇప్పటికే కొందరు పౌరులు ఈ అంశంపై మండల తహసీల్దార్, మున్సిపల్ అధికారులు, జిల్లా ఐటీ శాఖకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
అయితే ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించిన రుసుములు మీసేవ కేంద్రంలో గోడపై ప్రదర్శించాల్సి ఉంటుందని నిబంధనల్లో ఉంది. కానీ చాలా కేంద్రాల్లో ఆ వివరాలు గోడపై లేకపోవడం గమనార్హం. ఈ విషయం పై అధికారులు పర్యవేక్షణ పెంచి, ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మీసేవ కేంద్రాల ఉద్దేశం ప్రజలకు సౌకర్యం కల్పించడం కాని, వ్యాపారం చేయడం కాదని వారు గుర్తుచేశారు. నియమ నిబంధనలను ఉల్లంఘించే కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పడుతుందని ప్రజాభిప్రాయం వ్యక్తమవుతోంది.






