చెరకు రైతుల సమస్యలపై ఉన్నతాధికారుల కమిటీ
- ప్రైవేటు రంగ చక్కెర పరిశ్రమలను కాపాడుకుంటాం
- కార్మికులు, రైతుల శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి) : చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించేందుకు ఉన్న తాధికారులతో ఒక కమిటీని నియమిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. శనివారం సచివాలయంలో ఆయన చెరకు రైతులు, పరిశ్రమల ప్రతినిధులు, చెరుకు అభివృద్ధి మండళ్ల (సీడీసీ) చైర్మన్లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో ఏటా చెరకు సాగు విస్తీర్ణం తగ్గుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. అదే సమయంలో రాష్ర్టంలోని చక్కెర పరిశ్రమల సమస్యలు కూడా పరిష్కరించాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలిపా రు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన ప్రధాన అంశాలపై అందరితో చర్చించి నివేదిక రూపొందించేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించనున్నట్టు ఆయన వెల్లడించారు.
ఇందులో సంబంధిత శాఖల అధికారులు, చక్కెర పరిశ్రమల ప్రతినిధులు కూడా ఉంటారని చెప్పారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో చెరకు రైతులకు అందుతున్న ప్రయోజనాలు, రాయితీలపై అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరలో నివేదిక అందిస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రతి క్వింటాలు సన్న ధాన్యానికి రాష్ర్ట ప్రభుత్వం అందిస్తున్న రూ.500 బోనస్‌ను చెరకు పంటకు కూడా వర్తింపచేయాలని రైతులు కోరుతున్న విషయం ము ఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని శ్రీధర్ బాబు తెలిపారు.
కూలీల సమస్య వల్ల చెరకు నరకడం రైతులకు సమస్యగా మారిందన్నారు. డ్రిప్ ఇరిగేషన్ రాయితీ, చెరుకు రవాణా చార్జీలను కొంత మేరకు భరించే అంశాన్ని కూడా కమిటీ అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రైవేటు రంగ చక్కెర పరిశ్రమలను కాపాడుకుంటామని తెలిపారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణ విషయంలో వారి అనుభవాన్ని వినియోగించుకుంటామని తెలిపారు.
కార్మికులు, రైతుల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉం దని వివరించారు. సమావేశంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ చైైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, స్పెష ల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, చక్కెర పరిశ్రమల డైరెక్టర్ నర్సిరెడ్డి, పలువురు అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, సీడీసీ చైైర్మన్లు, రైతులు పాల్గొన్నారు.






