10-07-2025 12:00:00 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ.1.26 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పటాన్ చెరు, జులై 9 : ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కలిసి రావాలని కోరారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్.ఐ.జీ, మ్యాక్ సొసైటీ కాలనీ, ఇక్రిసాట్ ఫెన్సింగ్ ఏరియాలలో రూ.1.26 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్డు, వాటర్ డ్రైనేజీ పనులు, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డితో కలిసి బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని వార్డుల పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్, సీనియర్ నాయకులు పరమేష్, ఐలేష్, పృథ్వీరాజ్, ఆయా కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
గుమ్మడిదల రైతులకు నష్టపరిహారం అందిస్తాం
గుమ్మడిదల పరిధిలోని సర్వే నంబర్ 109లో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో నష్టపోతున్న ప్రతి రైతుకి మెరుగైన నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం భూములు కోల్పోతున్న గుమ్మడిదల రైతులు పటాన్ చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు.
టీజీఐఐసీ ద్వారా చేపడుతున్న భూ సేకరణ అంశంలో న్యాయమైన నష్టపరిహారం అందించేలా ప్రభుత్వంతో చర్చించనున్నట్లు తెలిపారు. భూసేకరణ అంశంపై రైతులు వెలిబుచ్చిన సందేహాలపై జిల్లా అదనపు కలెక్టర్ మాధురితో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం అందించకుండా నష్టపరిహారం అంశంలో తుది నిర్ణయం తీసుకోవద్దని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకుని వెళ్లి రైతులకు మెరుగైన నష్టపరిహారం అందించేందుకు కృషి చేయనున్నట్లు ఆమెకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, మద్దుల బాల్ రెడ్డి, వెంకటేష్, దేవేందర్ రెడ్డి, సత్యనారాయణ, అంజి యాదవ్, సూర్యనారాయణ, రైతులు తదితరులుపాల్గొన్నారు.