09-07-2025 11:51:09 PM
ఇదే నా మరణ వాంగ్మూలం..
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్..
హైదరాబాద్ (విజయక్రాంతి): ‘రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నా తలను గాంధీ భవన్‌పై వేలాడదీసుకుంటానని, ఇదే నా మరణ వాంగ్మూలం’ అని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్(Former MLA Rasamayi Balakishan) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకిషన్ మాట్లాడుతూ... కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను తిడితే హెడ్ లైన్లలో ఉంటామనే భ్రమతో కాంగ్రెస్ నేతలు పిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారని, ఉద్యమంపై దాడులు చేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ నేతలు ఇసుక దందాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వార్డు మెంబెర్‌గా గెలవని వాళ్లు కూడా కేటీఆర్‌ను విమర్శిస్తున్నారని, ఆయనకు సొంత శక్తి లేకపోతే అన్నిసార్లు రాజీనామా చేసి గెలవలేరని బాలకిషన్ చెప్పారు. కేటీఆర్ అసెంబ్లీలో ఉన్నపుడు అసెంబ్లీ పాస్ కోసం ప్రయత్నించిన వారు కూడా ఇవ్వాళ మాట్లాడ్తున్నారని బాలకిషన్ ఎద్దేవా చేశారు.