6 May, 2026 | 2:23 AM

పామ్‌ఆయిల్‌తో అధిక లాభాలు: ఎమ్మెల్యే తోట

06-05-2026 12:58 AM

జుక్కల్, మే 5 (విజయక్రాంతి): పామాయిల్ తో రైతులు అధిక దిగుబడి పండించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలోని మాజీ ఏఎంసీ చైర్మన్ సాయ గౌడ్ పొలంలో ఆయిల్ పామ్ తోటలను పరిశీలించారు. అనంతరం అక్కడ ప్రజా పాలన ప్రగతి ప్రాణాలకు కార్యక్రమంలో భాగంగా ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగు, విస్తీర్ణం పెంపుదలపై అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

రైతులు ఎప్పటికీ వేసుకునే పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి అవగాహన కల్పించారు. ఆయిల్ పామ్ పంటలో నాట్లు వేశాక కొన్ని సంవత్సరాల అనంతరం దిగుబడి ప్రారంభమై, ఆర్థిక లాభాలు క్రమంగా పెరుగుతాయని వివరించారు. ఆయిల్ పామ్ సాగు చేస్తోన్న రైతులను ఎమ్మెల్యే సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు విస్తరణతో వచ్చే లాభాలను రైతులకు తెలియజేసి, ఆధునిక పద్ధతులు అవలంభించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులతో పాటు మండల స్థాయి అధికారులు తహశీల్దార్ మారుతి, ఎంపీడీవో శ్రీనివాస్, ఐకెపి ఏపీఎం వందేమాతరం, ఈజిఎస్ ఏపీవో తులసీరామ్, ఏవో మహేశ్వరి నాయకులు తదితరులు పాల్గొన్నారు.