20 శాతం తగ్గిన ఇళ్ల అమ్మకాలు
- హైదరాబాద్ నగరంపై ప్రాప్ ఈక్విటీ నివేదిక
- దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లోనూ సర్వే
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 22 (విజయక్రాంతి): దేశంలో రియల్ ఎస్టే ట్ రంగం దూసుకెళ్తున్నప్పటికీ కొన్ని ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు కొంతవరకు తగ్గాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్-, మే, జూన్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 2% మేర తగ్గినట్టు రియల్ ఎస్టేట్ డాటా విశ్లేషణా సంస్థ ప్రాప్ ఈక్విటీ విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 20 శాతం తగ్గాయని, కేవలం 15,016 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయని ఆ నివేదిక పేర్కొన్నది.
గత ఏడాది ఇదే త్రైమాసికంలో 18,757 యూనిట్ల అమ్మకాలు నమోదుకాగా, ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. పుణెలో గత ఏడాది త్రైమాసికం తో పోల్చి చూసినప్పుడు విక్రయాలు 15 శాతం క్షీణతతో 22,482 యూనిట్లుగా ఉంటాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన నగ రాల్లో జూన్ త్రైమాసికంలో 1,19,901 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదు కావచ్చని, గత ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,21,856 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి, -మార్చి నెలల్లో ఈ తొమ్మిది నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 1,46,194 యూనిట్లుగా ఉన్నాయని, దీంతో పోలిస్తే జూన్ త్రైమాసికంలో విక్రయాలు 18 శాతం తగ్గినట్టు పేర్కొంది.
విలాసవంత ఇళ్లవైపు మొగ్గు
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతున్నప్పటికీ చాలామంది బయ్యర్లు విశాల మైన, విలాసవంతమైన ఇళ్లను కొనుగోలుచేసేందుకే మొగ్గు చూపిస్తుండటంతో అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలు తగ్గుతున్నాయని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలోని 8 ప్రధా న నగరాల్లో గత ఏడాది జనవరి, -మార్చి త్రైమాసికంతో పోలిస్తే.. ఈ ఏడాది అదే సమయంలో ఈ ఇళ్ల అమ్మకాలు 4 శాతం మేర తగ్గి 61,121 యూనిట్లకు పరిమితం అయ్యాయి. రూ.60 లక్షలలోపు ధర కలిగిన ఇళ్లు గత ఏడాది జనవరి,- మార్చి త్రైమాసికంలో 63,787 ఇళ్లు అమ్ముడయ్యాయి. కానీ ఈ ఏడాదికి వచ్చేసరికి వాటి అమ్మకాలు తగ్గాయి. తక్కువ సరఫరా ఉండటం, ప్రజలు లగ్జరీ అపార్ట్‌మెంట్లవైపు దృష్టి సారించ డం వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణాలని ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో గతేడాది మొదటి త్రైమాసికంలో 52,818 అందుబాటు ఇళ్లు నిర్మా ణం కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అవి 33,420 యూనిట్లకే పరిమితమయ్యాయి.
అందుబాటు ధరల ఇళ్లతో పోలిస్తే ప్రీమియం, లగ్జరీ ఇళ్ల ప్రాజెక్టుల్లో లాభాలు ఎక్కువగా ఉండటంతో డెవలపర్లు కూడా వాటి వైపు మొగ్గు చూపిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. దీనివల్లే అందుబాటు ధరల ఇళ్ల నిర్మాణం, అమ్మకాలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. 2022లో మొత్తం 2,51,198 ఇళ్లు అమ్ముడుకాగా, 2023లో అవి 2,35,340 యూనిట్లకు తగ్గాయి. 2019లో రూ.60 లక్షలలోపు ధర కలిగిన ఇళ్లు 2,26,414 అమ్ముడుకాగా, 2020లో కరోనా కారణంగా 1,88,233 యూనిట్ల అమ్మకాలయ్యాయి. 2021 లో మళ్లీ పుంజుకున్నాయి. ఆ ఏడాది 2,17,274 యూనిట్లు అమ్ముడవగా, 2022లోనూ వీటి అమ్మకాలు పెరిగినప్పటికీ, 2023 నుంచి క్రమం గా తగ్గడం ప్రారంభించాయి. హైదరాబాద్‌లోనూ ఇళ్ల అమ్మకాల్లో తగ్గుదల కనిపిస్తోంది. జనవరి-, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికంలో 3,674 యూని ట్లు అమ్ముడవగా, ఈ ఏడాది అదే సమయంలో 3,360 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యా యి. రియల్ ధరలు అధికంగా ఉన్న ముంబైలో మాత్రం ఇందుకు విరుద్దమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ గత ఏడాది త్రైమాసికంలో 23,401 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అవి 28,826 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
నగరాలవారీగా ఇలా..
ఢిల్లీలో 10,198 యూనిట్ల విక్రయాలు ఉండొచ్చన్నది ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. ఇది గత ఏడాది కంటే 6 శాతం అధికం. గత ఏడాది ఇదే సమయంలో అక్కడ 9,635 యూనిట్లు అమ్ముడయ్యాయి. బెంగళూరులో గత ఏడాది జూన్ త్రైమాసికంలో 15,127 యూనిట్లు అమ్ముడు కాగా, ఈ ఏడాది ఇదే సమయంలో 15,088 యూనిట్లు అమ్ముడయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. చెన్నులో గత ఏడాది జూన్ త్రైమాసికంలో 4,950 ఇళ్లు విక్రయం కాగా, ఈ ఏడాది ఇదే సమయంలో 4,841 యూనిట్లు అమ్ముడు కావచ్చని అంచనా వేసింది. కోల్‌కతాలో విక్రయాలు 25 శాతం వృద్ధితో 4,025 యూనిట్ల నుంచి 5,130 యూనిట్లకు చేరవచ్చని పేర్కొంది. ముంబైలో అమ్మకాలు 13,032 యూనిట్లకు పరిమితం కావొచ్చని, గత ఏడాది ఇదే సమయంలో 13,219 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయని వివరించింది. నవీ ముంబైలో ఇళ్ల అమ్మకాలు 36 శాతం వృద్ధితో 9,035 యూనిట్లకు చేరవచ్చని తెలిపింది. థానేలో ఇళ్ల అమ్మకాలు 9 శాతం పెరిగి 25,041 యూనిట్లకు చేరవచ్చని ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది.






