1 August, 2026 | 12:24 PM

ఆగని ప్రీలాంచ్ మోసాలు

23-06-2024 02:30 AM

తీరు మారని రెరా..

సాహితి గ్రూప్ రూ.1,500 కోట్లు, జయా గ్రూప్ రూ.300 కోట్లు, మైత్రీ ప్రాజెక్ట్స్ రూ.100 కోట్లు, భువనతేజ రూ.200 కోట్లు, జేవీ ఎస్టేట్స్ రూ.300 కోట్లు, భారతి బిల్డర్స్ రూ.300 కోట్లు, భారతి లేక్‌వ్యూ రూ.60 కోట్లు, ఓబిలీ ఇన్‌ఫ్రా రూ.20 కోట్లు, జేజే ఇన్‌ఫ్రా రూ.10 కోట్లు, తాజాగా జీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా గ్రూప్ రూ.200 కోట్లు.. ఇవి తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులు కాదు. హైదరాబాద్ కేంద్రంగా బడా రియల్ ఎస్టేట్ సంస్థలు చేసిన రియల్ మోసాలు. రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీలాంచ్‌ల పేరుతో ఇటీవల ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము సుమారు రూ.3 వేల (రూ.2,990 కోట్లు) కోట్లు.

వాస్తవానికి ప్రీలాంచ్‌లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. కానీ హైదరాబాద్ కేంద్రంగా బడా రియల్ ఎస్టేట్ సంస్థలు బహిరంగంగానే ప్రీలాంచ్‌ల పేరుతో సామాన్య ప్రజల నుంచి కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నాయి. ప్రీలాంచ్ మోసాలు హైదరాబాద్ రియాల్టీకి మచ్చలా మారుతున్నాయి. ఈ విషయం తెలిసినా రెరా.. ఆ రియల్ సంస్థల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. తప్పనిసరి పరిస్థితి వస్తే మాత్రం జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నది. దీంతో రియల్ రంగంలో రారాజుగా వెలుగుతున్న హైదరాబాద్.. మరోవైపు ప్రీలాంచ్ స్కాములకు కూడా రాజధానిగా మారుతోంది. 

హైదరాబాద్ రియాల్టీకి మచ్చలా మారుతున్న ప్రీలాంచ్ మోసాలు

కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులు ఎత్తేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు

ప్రీలాంచ్‌ల పేరుతో రూ.3 వేల కోట్ల దోపిడీ

పోలీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులు

పట్టించుకోని రెరా, నిర్మాణ సంఘాలు

న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని బాధితుల వేడుకోలు

 హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 22 (విజయాక్రాంతి) : హైదరాబాద్ నగరంలో రియల్ మోసాలు మొదలు ఇప్పుడే కాదు.. అంతం కూడా కాదు. కానీ రియల్ మోసాలకు అడ్డుకట్ట వేసి ప్రజలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెరా నిబంధనల ను అమల్లోకి తీసుకొచ్చింది. రియల్ మోసాలకు ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం ఇటీవల రెరా చైర్మన్‌తోపాటు అధికారులతో ప్రత్యేక ట్రిబ్యునల్‌ను నియమించింది. కానీ కళ్ల ముందే వందల కోట్ల రియల్ మోసాలు జరుగుతున్నా రెరా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతో రియల్ మోసాలు నిత్యకృత్యంగా మారాయి. రెరా నిబంధనల ప్రకారం ప్రీలాంచ్‌లు చేయరాదు. రెరా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులు లేకుం డా నిర్మిస్తున్న భవనాలను అక్రమ నిర్మాణాలుగా భావించాల్సి ఉంటుంది. కానీ హెచ్‌ఎండీఏ పరిధిలో రెరా నిబంధనలు నీరుగార్చుతూ నిర్మాణ సంస్థలు యథేచ్ఛగా ప్రీలాంచ్‌లు చేస్తున్నా అధికారులు చూసీచూడనట్టు ఉండటం వెనుక మతలబు ఏమిటో అంతు చిక్కడం లేదు. హెచ్‌ఎండీఏ నిర్వహించే వేలం పాటల్లో భూములను దక్కించుకున్న బిల్డర్లు ప్రీలాంచుల ద్వారా వచ్చిన సొమ్మును హెచ్‌ఎండీఏకు చెల్లించేవారు.

ఆదా యం వస్తుండటంతో ప్రభుత్వంతోపాటు రెరా అధికారులు బిల్డర్ల అక్రమాల పట్ల చూసీచూడనట్టు వ్యవహరించారు. బిల్డర్ల అక్రమాలపై ప్రభు త్వం కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో మెజా ర్టీ బిల్డర్లు ప్రీలాంచ్‌లపైనే ఆదారపడతున్నారు. ప్రీలాంచ్ చేయకపోతే అసలు బిల్డరే కాదనే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే నగరంలో ప్రస్తు తం రియల్ మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, భవిష్యత్తులో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజల విశ్వసనీయతను కోల్పోతారని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అగ్గువ బేరం అసలుకే మోసం

చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు తక్కువ ధరలకు వచ్చే ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ప్రీలాంచ్ చేసే బిల్డర్లు ఇలాంటి కస్టమర్లనే టార్గెట్ చేస్తారు. రకరకాల ఆఫర్లను చెప్పి ప్లాట్లను అంటగడుతారు. ప్రీలాం చ్ బిల్డర్లు చెప్పే మాటలు, చేసే ప్రకటనల్లో ఎక్కడైనా అప్పు చేసైనా ప్లాటు కొనుగోలు చేయాల నుకునే పరిస్థితి కల్పిస్తారు. కానీ వాళ్ల వద్ద ఫ్లాట్ కొనాలనుకునే వాళ్లు ఈ భవనాలను నిర్మించింది ఎవ్వరు? అతని కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? గతంలో ఎప్పుడైనా అపార్టుమెంట్లను నిర్మించిన అనుభవం ఉన్నదా? అతని వద్ద గతంలో ఫ్లాట్ల ను కొనుగోలు చేసిన వాళ్లు సంతోషంగానే ఉన్నా రా? ప్రీలాంచ్‌లో భాగంగా సొమ్ము కట్టిన తర్వాత.. వాళ్ల నిర్మాణాలకు అనుమతులు రాకుం టే ఎలా? చెల్లించిన సొమ్ము తిరిగి ఇస్తారా లేదా? వంటి అంశాలపై దృష్టి సారించాలని రియల్ నిపుణులు సూచిస్తున్నారు.

పట్టించుకోని నిర్మాణ సంస్థలు

నిర్మాణ రంగంలో కస్టమర్ల ఇన్వెస్ట్‌మెంట్లకు గ్యారెంటీ ఉంటుందని క్రెడాయ్ పెద్దలు పదేపదే చెప్తారు. కానీ ఆయా సంఘంలో కీలకంగా ఉన్న సభ్యులు చేస్తున్న ప్రీలాంచుల్ని అరికట్టడంలో మాత్రం ఆ సంఘం విఫలమైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రీలాంచులు చేసే వారిపై ఆ క్రెడాయ్ హైదరాబాద్ పెద్దలు నోరు మెదపలేదు. దీంతో అధిక శాతం బిల్డర్లు ఇష్టం వచ్చిన రేటుకు ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. ఇలాంటి బిల్డర్ల వల్ల ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెరా నుంచి అనుమతులతో నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. కొల్లూరు, వెలిమల, కిస్మత్‌పూర్ వంటి ప్రాంతాల్లో ప్రీలాంచుల వల్ల గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కోకాపేట్, నార్సింగి ప్రాంతాల్లో రెరా ఫ్లాట్లను కొనడానికి ముందుకు రావడంలేదు. ఇదే పరిస్థితి నగరమంతటా నెలకొందని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా..

క్రెడాయ్ హైదరాబాద్‌కు చెందిన కొన్ని నిర్మాణ సంస్థలు ప్రీలాంచులు చేస్తున్నాయని తెలిసినా.. ఆయా కంపెనీలపై రెరా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జీవో 111 ఉన్న ప్రాంతంలో ఓ బడా నిర్మాణ సంస్థ అక్రమంగా విల్లాలను నిర్మిస్తోంది. ఆ సంస్థ చేస్తున్న నిర్మాణాలు పూర్తిగా నిబంధనలకు విరుద్ధం అని తెలిసినా ఆ సంస్థకు రెరా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. నిషేధిత ప్రాంతంలో విల్లాలను నిర్మిస్తున్నారని, బాకారం పంచాయతీ కార్యదర్శి రంగా రెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసినప్పటికీ టీఎస్ రెరా స్పందించలేదు. కలుషితమైన నిర్మాణ రంగాన్ని, అవినీతిమయమైన రెరా బృందా న్ని కనీసం సీఎం రేవంత్‌రెడ్డి అయినా ప్రక్షాళన చేస్తారా? లేదా? వేచి చూడాలి మరి.

అప్పగింత ఆలస్యమైతే పరిహారం

బిల్డర్, బయ్యర్ల ఒప్పందం ప్రకారం నిర్ణీత గడువులోపు బిల్డర్ ఫ్లాట్‌ను బయ్యర్‌కు అప్పగించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది డెవ లపర్లు గడువులోగా ఫ్లాట్ అప్పగించే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు అప్పగింత ఆలస్యమైనందుకు డెవలపర్ నుంచి పరిహారం పొందే వెసులుబాటును రెరా చట్టం కల్పించింది. రెరా చట్టంలోని నిబంధనల ప్రకారం ఫిర్యాదు చేసేటప్పుడు ఉల్లంఘన జరిగి ఉండాలి. అప్ఫుడే పరిహారం పొందే అవకా శం ఉంటుంది. ఫిర్యాదు దాఖలు చేసే సమ యం నాటికి జాప్యం కొనసాగుతూ ఉంటేనే, డెవలపర్ నుంచి రెరా చట్టం (పరిహారం) సెక్ష న్ 18 కింద పరిహారం పొందే వీలుంటుంది. 

ఫ్లాట్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆలస్య పు పరిహారం పొందేందుకు వీలు ఉండదని కొనుగోలుదారులు గమనించాలి. పుణెలోని పరంజ్ పే స్కీమ్స్ కన్ స్ట్రక్షన్ లిమిటెడ్ నుంచి 2015లో రూ.50 లక్షలకు ఓ ప్రాపర్టీ కొనుగోలు చేశారు. ఒప్పందం ప్రకారం 2019 మార్చి నాటికి ప్రాపర్టీని అప్పగించాలి. అయి తే, కొనుగోలుదారు ఆ ప్రాపర్టీని 2022 మేలో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆలస్యమైన కాలానికిగానూ పరిహారం ఇప్పించాలని కోరుతూ మహారాష్ర్ట రెరాలో ఫిర్యా దు చేశారు. ఫ్లాట్ స్వాధీనం చేసుకున్న తర్వా త ఫిర్యాదు చేసినందున అది విచారణకు స్వీకరించవద్దని డెవలపర్ వాదించారు. పర్యావరణ అనుమతులు రావడం ఆలస్యం కార ణంగా జాప్యం జరిగిందని, అలాగే కొవిడ్ పరిస్థితులు కూడా ఇందుకు మరో కారణమ ని నివేదించారు. 

2021 ఏప్రిల్‌లో ఆక్యుపేషన్ సర్టిఫికెట్ పొందానని, అదే విషయం కొనుగోలుదారుకు చెప్పినప్పటికీ, ఆయన 2022 మే వరకు ఫ్లాట్ స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. అపార్ట్‌మెంట్ నిర్వహణకు సంబం ధించి ఏడాది చార్జీలను మినహాయించినట్టు వివరించారు. డెవలపర్ వాదనలతో రెరా ఏకీభవించింది. ఫ్లాట్ స్వాధీనం తర్వాత ఫిర్యాదు చేసినందున సెక్షన్ 18 కింద పరిహారం పొందలేరని స్పష్టంచేసింది.

జరిమానాలపై గోప్యత

హైదరాబాద్‌లో ప్రీలాంచులు, ఎక్స్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట కొన్ని నిర్మాణ సంస్థలు కోట్ల రూపాయలను ప్రజల నుంచి దండుకుంటున్నాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా బిల్డర్ల ప్రీలాంచుల్లో మోసపోయిన బయ్యర్లు ఫిర్యాదులు వస్తేనే తప్పా, ముందే రియల్ మోసాలను నియంత్రించడంలో రెరా అధికారులు పూర్తిగా విఫల మయ్యారని చెప్పవచ్చును. గతంలో కేశినేని డెవలపర్స్, సాహితి, మంత్రి డెవలపర్స్, సాయిసూర్య డెవలపర్స్ వంటి కంపెనీలపై దాదాపు రూ.17.50 కోట్ల జరిమానా విధించినట్టు రెరా ప్రకటించింది. కానీ విధించిన జరిమానాలో ఎంత మొత్తాన్ని రాబట్టారు? అనేది మాత్రం అధికారులు నేటికీ స్పష్టత ఇవ్వడం లేదు. అప్పుడప్పుడు కొన్ని సంస్థలకు నోటీసులిచ్చి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.