26 June, 2026 | 1:48 AM

దమ్మాయిగూడకు ‘మెట్రో’ ఎప్పుడో..!

26-06-2026 12:00 AM

రెండో దశ విస్తరణతో ప్రజల్లో ఆశలు

జవహర్ నగర్, జూన్ 25 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా నగర శివారు ప్రాంతాలకు మెట్రో సేవలను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఫేజ్-2Bలో జేబీఎస్‌మేడ్చల్, జేబీఎస్‌షామీర్పేట్, ఎయిర్పోర్ట్‌ఫ్యూచర్ సిటీ కారిడార్లు ఉన్నాయి.

దమ్మాయిగూడ, నాగారం, జవహర్నగర్, కీసర ప్రాంతాలకు ప్రత్యక్ష మెట్రో మార్గం ప్రస్తుతం అధికారికంగా ప్రకటించబడకపోయినా, మేడ్చల్ మరియు షామీర్పేట్ కారిడార్లు అమలులోకి వస్తే భవిష్యత్తులో ఈ ప్రాంతాలకు మెట్రో విస్తరణ అవకాశాలు పెరుగుతాయని రవాణా నిపుణులు భావిస్తున్నారు.

వేగంగా పెరుగుతున్న జనాభా, కొత్త కాలనీలు, రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో దమ్మాయిగూడ ప్రజలు మెట్రో కనెక్టివిటీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసీఐఎల్, ఉప్పల్, సికింద్రాబాద్ ప్రాంతాలకు వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు ప్రతిరోజూ ప్రయాణిస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు మరియు సామాజిక సంస్థలు ఈసీఐఎల్‌నాగారందమ్మాయిగూడజవహర్నగర్‌కీసర మెట్రో కారిడార్ను భవిష్యత్ ప్రణాళికల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మెట్రో అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు రియల్ ఎస్టేట్, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.మేడ్చల్కు మెట్రో వస్తే.. దమ్మాయిగూడకు ఎందుకు కాదు? అనే ప్రశ్న ఇప్పుడు స్థానిక ప్రజల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ విస్తరణ ప్రణాళికల్లో దమ్మాయిగూడ, నాగారం, జవహర్నగర్, కీసర ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అన్నదానిపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.