ఆర్టీసీ బస్సు-టాటా ఏస్ ఢీ..
- ఒకరి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
- క్షతగాత్రులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరామర్శ
వేములవాడ, జూలై 9, (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ గ్రామం అనుపురం సమీపంలో బస్సుటాటా ఏస్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఒకరు మృ తి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంది 22 మందికి గాయాలు . తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతేతో కలిసి వేములవాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.






