10 July, 2026 | 1:53 AM

వరికి ప్రత్యామ్నాయ పంటలపై రైతులను ప్రోత్సహించాలి

10-07-2026 12:00 AM

రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి

వ్యవసాయ ఆధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో ఉండాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, జూలై 9 (విజయక్రాంతి): జిల్లాలో లోటు వర్షపాతం నమోదవుతున్నందున, ఎల్ నినో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వరికి బదులుగా ప్రత్యా మ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

ఎల్ నినో ప్రభావం, వానాకాలం సాగు, తదుపరి కార్యాచరణ అంశంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వ్యవసాయ, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో మాట్లాడారు.కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు లోటు వర్షపాతం ఉందని, ఎల్ నినో ప్రభావం కూడా కనిపిస్తున్నందున రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని అన్నారు. రైతు వేదికల్లో వ్యవసాయ అధికారులు సమావేశాలు నిర్వహించి రైతులకు సూచనలు అందించాలన్నారు. ఆరుతడి పంటలు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు వంటి పంటల సాగు ఆవశ్యకత తెలియజేయాలని ఆదేశించారు.